- మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం.
- రెడ్ జోన్, గ్రీన్ జోన్‌గా అతిథులు ఉండే పరిసరాలు.
- సామాన్యులకు వీక్షించే అవకాశం.
- హెరిటేజ్ వాక్‌పై ఉత్కంఠ.. షెడ్యూల్ మారే చాన్స్.
- నాడు మిస్ ఇండియా పోటీలు.. నేడు మిస్ వరల్డ్ పోటీలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మిస్ వరల్డ్ సంస్థతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. విదేశీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడంతో రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల సుందరీమణులతో పాటు అంతర్జాతీయ మీడియా ఫోకస్ కూడా ఇక్కడ ఉండడంతో భాగ్యనగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. మిల్ వరల్డ్ పోటీల నిర్వహణద్వారా రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటూ పెట్టుబడుల ఆకర్షణకు అందాల పోటీలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.ఈ పోటీలు భారతదేశానికి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే10న ప్రారంభం కానుండగా శుక్రవారం సాయంత్రం వరకు 116 దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీదారులు, నిర్వాహక బృందం, సిబ్బంది హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టు సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెన్నా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం గమనార్హం. విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, కళాకారులు, ఉద్యమకారులుగా ఉన్న పోటీదారులు తమ దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- 20 రోజుల సంబురం.
శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకలలో తెలంగాణ సంస్కృతి, కళలు ఆకట్టుకునేలా రూపొందించారు. వాటిలో మొదట తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత కాకతీయుల కాలం నుండి తెలంగాణ శాస్త్రీయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ప్రముఖ సంగీత నిపుణుడు ఫణి నారాయణ గారు స్వరాలు సమకూర్చారు. దాంతోపాటు కళాకారులు అందరూ కలిసి నక్షత్రం ఆకారం లో, సీతాకోకచిలుక ఆకారాన్ని, అలాగే మిస్ వరల్డ్ లోగో ఆకృతిని కూడా తమ విన్యాసాల లో భాగంగా ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా, ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలతో ప్రారంభమవుతాయి. వాటిలో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ ప్రాంతం నుంచి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన కత్లే శ్రీధర్ బృందంతో మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక కి పరిచయం అవుతారు. అలాగే తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పులు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందే భాస్కర్ బృందంతో, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలు స్వప్న బృందంతో ప్రదర్శనకి వస్తాయి. తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందంచే ప్రదర్శితమవుతోంది. ఈ కళారూపాలు అన్నింటి మేళవింపుగా ముగింపు ఉంటుంది. ఇలా సౌందర్యం, సంస్కృతి రెండు కలగలిసిన వేడుకగా ఈ ప్రారంభోత్సవ సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది.మొత్తంగా మే 10 నుంచి 31 వరకు ఈవెంట్ కొనసాగుతుంది. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని. అతిథులు ఉండే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్‌గా ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరికి లోపలకు అనుమతి ఉండదని, తెలంగాణలో చాలా ప్రదేశాలను ప్రత్యేక అతిథులు సందర్శిస్తారని పోలీసులు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం ఎలాంటి ట్రాఫిక్ డైవర్షన్లు ఉండవని స్పష్టం చేశారు.
- నగరంలో అందాల తారలు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు 116 మంది సుందరీమణులు హైదరాబాద్ చేరుకున్నారు. మిస్ వరల్డ్ లిమిటెడ్‌కు చెందిన ప్రతినిధులు, సహాయకులు వచ్చేశారు. పోటీలకోసం సిద్ధమైన గచ్చిబౌలి స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా సాగాయ్. నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే ఈ వేడుకలను వీక్షించే అవకాశం సామాన్యులకు కల్పిస్తోంది ప్రభుత్వం.ఈ మేరకు టూరిజం వెబ్‌సైట్ https://tourism.telangana.gov. in/events&single/miss& world& event లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది.పోటీల జరిగే ఒక్కో కేంద్రంలో వెయ్యి మంది సామాన్యులు వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.కాగా, పోటీదారులు దాదాపు నెల రోజుల పాటు తెలంగాణలోని పర్యాటక, సాంస్కృతిక , వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల సందర్భంగా తెలంగాణ జరూర్ ఆనా (తప్పకుండా తెలంగాణకు రండి, పర్యటించండి) అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తెలంగాణలోని పర్యాటక రంగం వృద్ధి చెందడం, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోటీలపై అన్ని రాష్ట్రాలలోని ప్రధాన ఎయిర్ పోర్టులలో ప్రచారం కల్పించారు. అలాగే సామాన్యులు సైతం ఈ పోటీలను తిలకించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ వెబ్ సైట్‌లో పేర్లను నమోదు చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మందికి చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
- హెరిటేజ్ వాక్.. సవాల్.
భారత్ -పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. 116 దేశాల నుండి వచ్చే అందాల పోటీదారులకు, స్పాన్సర్లకు, అంతర్జాతీయ మీడియాకు పూర్తి స్థాయి భద్రత కల్పించడంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.ముఖ్యంగా హైదరాబాద్‌లోని వ్యూహాత్మక ప్రదేశాలు, సాధారణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వీరికి కూడా రక్షణ కల్పిస్తున్నారు.అయితే, షెడ్యూల్ ప్రకారం పోటీదారులు నాగార్జునసాగర్, చార్మినార్, వరంగల్, యాదగిరిగుట్ట వంటి సుదూర ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటం కొంత కష్టమైన పని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ షెడ్యూల్ కొంత మార్చే అవకాశం ఉంది.మిస్ వరల్డ్ -2025 పోటీల్లో భాగంగా ఈనెల 13న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లతోపాటు ఇక్కడ సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్‌లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు.120 దేశాల మిస్ వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే ఈ హెరిటేజ్ వాక్ ను 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ప్రమోట్ చేయనున్నారు.అతిథులు బస చేసే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్లుగా కేటగిరి చేశారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భద్రతా సిబ్బందిని నగరానికి రప్పించారు. 120 దేశాలకు పైగా మిస్ వరల్డ్ ప్రతినిధులు ఓల్డుసిటీ హెరిటేజ్ వాక్ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.సాధారణ రోజుల్లో సైతం ఓల్డుసిటీ సమస్యాత్మక ప్రాంతం కావడం, అందులోనూ ప్రస్తుతం ఇండియా,పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేధపధ్యంలో ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్ పై తెలంగాణ పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. మిస్ వరల్డ్ ప్రతినిధులు వాక్ చేసే ప్రాంతాన్ని ఇప్పటి నుండి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘాపెట్టారు. హెరిటేజ్ వాక్ కు 24 గంటల ముందునుండే భద్రతా బలగాలు హెరటేజ్ వాక్ జరిగే ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోనున్నాయి. సాధారణ రోజుల్లో సైతం సమస్యాత్మక ప్రాంతం కావడం, అందులోనూ ప్రస్తుతం ఇండియా,పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేధపధ్యంలో ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్ పై తెలంగాణ పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిసారించింది.ఇప్పటికే హైదరాబాద్ కు ఉగ్రవాదుల నుండి దాడుల ముప్పు పొంచి ఉండటంతో , తేడా వస్తే ప్రపంచ దేశాల ముందు హైదరాబాద్ తోపాటు దేశ ఖ్యాతి దెబ్బతినే అవకాశం ఉండటంతో ప్రభుత్వం హెరిటేజ్ వాక్ ను సీరియస్ గా తీసుకుంది.మిస్ వరల్డ్ ప్రతినిధులు వాక్ చేసే ప్రాంతాన్ని ఇప్పటి నుండి పోలీసులు క్షున్నంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘాపెట్టారు.హెరిటేజ్ వాక్ కు 24 గంటల ముందునుండే భద్రతా బలగాలు హెరటేజ్ వాక్ జరిగే ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోనున్నాయి. మొత్తంగా ఓల్డ్ సిటీలో 120దేశాల ప్రతినిధులు వాక్ ఉత్కంఠగా మారింది.
