Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏడాదిలో 22 వేల కోట్ల ఖర్చు

  • ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నిటారుగా నిలబడతాం.
  • పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరకు సంక్షేమ పథకాలు.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

మధిర, ముద్ర విలేఖరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఏడాదిలోనే 22 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ఓ రికార్డ్ అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం నిటారుగా నిలబడి పని చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఆదివారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం, మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే 93 లక్షల కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుడి వరకూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కేవలం ఏడాదిన్నర కాలంలోనే అందించామన్నారు. 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు కూడా మంజూరు చేయలేదని, పాలకులుగా విలాసవంతమైన జీవితాలు గడిపి రాష్ట్రం పై పడి దోచుకున్నారు తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదు అన్నారు. టిఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాల పాలనా కాలంలో పేదలకు ఇల్లు కడితే ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు అన్నారు. పది సంవత్సరాలు ఈ రాష్ట్రంపై పడి దోచుకుంది కాక రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, వారు తెచ్చిన అప్పులకు పది సంవత్సరాల తరువాత చెల్లింపులు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరోజు వారు తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం వివరించారు. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఒకటి తర్వాత ఒకటి సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి ప్రతి పైసా పేదల కోసం ఖర్చు పెడుతున్నాం అన్నారు.
ప్రజలు కోరుకున్న విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కో ఇంటినీ 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇళ్లను ఈ ఏడాది నిర్మిస్తున్నాం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదటి ఏడాది 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం పేదల ఇళ్ల కోసం ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని తెలిపారు. మనసున్న ప్రభుత్వం పేదల బాధలను అర్థం చేసుకొని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు మాత్రమే కాకుండా నిజమైన పేద వాళ్ళందరికీ ఇల్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కొన్నిచోట్ల పాదయాత్ర మరికొన్ని చోట్ల బహిరంగ సభలు నిర్వహించగా, ప్రతిపక్ష నేతగా తాను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాలుగు నెలలపాటు పీపుల్స్ మార్చి పేరిట నడివేసవిలో సుదీర్ఘ పాదయాత్ర చేశానని ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేక పేదలు పడుతున్న బాధలు గుర్తించి నిజమైన పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని పేదవారు ఏ ఒక్కరూ ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికేందుకు ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.ప్రజల అవసరాల ఎ జెండాగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది రాష్ట్రంలో కోటి 12 లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నాం అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రైతు భరోసా కోసం నేటి వరకు 17,500 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. మహిళల కోసం ఇందిరా క్రాంతి పదం ద్వారా డ్వాక్రా సంఘాలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం ఐదు సంవత్సరాల కాలంలో కనీసం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలిపారు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తొలుత మధిర ట్యాంక్ బండ్ వద్ద రూ. 6.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పర్యాటక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.