Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి

  • రైతులకు వాస్తవాలు వివరించి భరోసా కల్పించాలి.
  • కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు.
  • కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలి.
  • క్షేత్ర స్థాయిలో లోపాలు గుర్తించి సత్వరమే పరిష్కరించాలి.
  • ధాన్యంకొనుగోళ్ల పురోగతిపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తోన్నదుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిజానిజాలు ప్రజలకు బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.యాసంగి లోనూ రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయితే 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసినట్లు చెప్పారు.70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు వెల్లడించారు. 2023 రబీ సీజన్ లో మే15 నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే,ఈ రబీ సీజన్ లో అదే మే 15 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు.ధాన్యం కొనుగోళ్ల కు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందెన్నడూ లేని రీతిలో ఈ సారి పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 8,348 కొనుగోలు కేంద్రాలు చేసినట్లు వివరించారు. 2021-2022 రబీ సీజన్ తో పోలిస్తే ఈ రబీ సీజన్ లో అధికంగా1,739 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.ధాన్యం దిగుబడి అదే స్ధాయిలో వచ్చిందన్నారు.రికార్డు స్థాయిలో దిగుబడి పెరగడంతో కొనుగోలు కేంద్రాల పెంచామన్నారు.ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు.ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు చెప్పారు.కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.10,12 రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో లోపాలు గుర్తించి సత్వరమే పరిష్కరించాలని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,పౌర సరఫరాల శాఖా ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.