తెలంగాణ యువతకు ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులు- టి-సాట్ లైవ్ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి
• యూజీ అండ్ పీజీ విద్యార్థుల కోసం 39 స్పెషల్ కోర్సులు
• విజన్ 2047 లక్ష్యంగా కార్యాచరణ
ముద్ర, శేరిలింగంపల్లి :
తెలంగాణ యువత కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తూ కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ‘యూజీ అండ్ పీజీ కోర్సెస్ న్యూ అండ్ ఎమెర్జింగ్ ఏరియాస్’ అనే అంశంపై మంగళవారం టి-సాట్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తాము ప్రతిపాదించే కొత్త కోర్సులకు సంబంధించిన వివరాలు తమ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కళలను నిజం చేసేందుకు తెలంగాణలోని అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం సుమారు 39 కోర్సులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి విజన్ లో భాగమైన 2047 లక్ష్యాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులను రూపొందించామన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 19 కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మరో 10 కోర్సులను తక్షణమే ఉపాధి కల్పించేవిగా ఆచరణలోకి తేబోతున్నామని, ఏఈడీపీ( అప్పెంటీస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రొగ్పామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులు ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. 2030 సంవత్సరానికీ మూడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పబ్లిక్ అండ్ ప్రయివేటు భాగస్వామ్యంతో తెలంగాణాలోని వివిధ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ ఉద్యోగాలను సాధించేందుకు తెలంగాణ యువతను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి పనిచేస్తుందని బాలకిష్టారెడ్డి వివరించారు. కళాశాలల్లో క్యాలిటీ టీచింగ్, మానిటరింగ్, అకడమిక్ పార్టిసిపేషన్, రీసెర్చ్ తదితర అంశాలను తప్పనిసరిగా పాటించాలని ఛైర్మన్ సూచించారు. వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్.కె.మహమూద్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ వంటి ప్రత్యేక కోర్సులలో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా యూనివర్సిటీలకు, ఆయా కళాశాలకు తగిన సలహాలు-సూచనలు అందిస్తున్నామన్నారు. మండలి మరో వైస్ ఛైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులు కోర్సు పూర్తి చేయడంతో పాటు నైపుణ్యం తప్పని సరిగా ఉండాలని సూచించారు. ఎన్ని ఉన్నత చదువులు చదివినా నైపుణ్యం లేని చదువువల్ల ప్రయోజనం, ఉపాధి రెండూ ఉండవన్నారు. కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ యూనివర్సిటీ లేదా కళాశాల తాము నిర్వహించే కోర్సులకు సంబంధించి ఖచ్చితంగా ల్యాబ్స్ నిర్వహించాలని సూచించారు. కొత్త కోర్సులు ప్రారంభించి వదిలివేయడమే కాకుండా వాటిపై తప్పని సరిగా తమ వైపు నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.