ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో,మహిళా సాధికారత కేంద్రం సహకారంతో “బేటీ జన్మోత్సవ కార్యక్రమం” మంగళవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు మరియు ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీడబ్ల్యూఓ,డీఎంహెచ్ఓ మాట్లాడుతూ
ఆడపిల్లలు,మగపిల్లలను సమానంగా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల గౌరవం పెంపొందించాల్సిన అవసరాన్ని, బాలికల విద్య, ఆరోగ్యం మరియు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. అలాగే పుట్టిన శిశువులకు తల్లి పాల ప్రాముఖ్యతను వివరించి, మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలనే ఇవ్వాలని అవగాహన కల్పించారు.
అదనంగా,అవసరమైన సందర్భాల్లో మహిళా సాధికారత కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు.బాలికల హక్కుల పరిరక్షణ,పోషణ మరియు విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ,డాక్టర్ నాగనిర్మల,మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.అనంతరం పటాన్ చేరు ఏరియా ఆస్పత్రిలో ఈకిట్స్ ను బాలింతలకు అందజేశారు.