ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షా సమావేశం మంగళ వారం నిర్వహించారు. మండలాల వారిగా పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు మంజూరైన వారి మార్కౌట్ పూర్తి చేసి, పనులు ప్రారంభించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించాలన్నారు. నిర్మాణాలు మందగించిన ప్రాంతాల్లో లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి రాజేశ్వర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.