ఈ నెల 25 నుంచి వచ్చే నెల 18 వరకు పరీక్షలు
హాజరుకానున్న 9,97,075 మంది విద్యార్థులు
వివరాలు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్ధినీ విద్యార్ధులకు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం స్టేట్ వైడ్‌గా 1,495 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది, ఇందులో ప్రైవేటు కాలేజీలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలు కూడా ఉండగా పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న బోర్డు… విద్యార్థులు వెబ్‌సైట్ (tgbie.cgg.gov.in) నుంచి లేదా కళాశాలల నుండి హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొన్నది. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్లను అనుమతించాలని బోర్డు ఆదేశించింది. కాగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే నిపుణులైన సైకాలజిస్టుల సలహాల కోసం 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని బోర్డు సూచించింది. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి.
7,500 సీసీ కెమెరాలతో నిఘా..
ఇక సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి అనుమతించరు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నిచర్, గోడ గడియారాలు వైద్య సహాయం అందుబాటులో ఉంటాయి. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని టీజీబీఐఈ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తారు. అలాగే, పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.