- గూగుల్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ మారింది.
- ఎకానమీ, ప్రభుత్వం, జీవితాలు డిజిటల్ గా మారాయి.
- డిజిటల్ సిస్టం సురక్షితంగా ఉంటే మరింత అభివృద్ధి సాధిస్తాం.
- మహిళలు, యువత, రైతులతో పాటు అన్ని వర్గాలకు ఉన్నత జీవన ప్రమాణాలు కల్పించాలి.
- గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్ధానంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. అన్ని రంగాలకు చెందిన కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ లో అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రపంచ దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ను హైటెక్ సిటీ సమీపంలో దివ్యశ్రీ బిల్డింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసియా-పసిఫిక్ రీజియన్‌లో గూగుల్ మొట్టమొదటి జీఎస్ఈసీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. అందరూ గర్వపడేలా జీఎస్ఈసీ పని చేస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ లక్ష్యాలను సాధించడంలో గూగుల్ మద్దతు అవసరమన్నారు. విద్య, భద్రత, మ్యాపింగ్, ట్రాఫిక్, స్టార్టప్స్, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ఇప్పటికే గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.తమ ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు గూగుల్ సంస్థ తరహాలోనే ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని విజ్ఙప్తి చేశారు. అందుకు అందరం కలిసికట్టుగా గొప్ప ప్రమాణాల కోసం ప్రయత్నిద్దామనీ అందుకు గూగుల్ సహకారం కావాలన్నారు. రాష్ట్రంలో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు వెళుతుందన్నారు. ఇందులో భాగంగా 2035 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమి వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.గూగుల్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ మారిందన్నారు.జీవితాలు పూర్తిగా డిజిటల్ మయమయ్యాయన్నారు. ఎకానమీ, ప్రభుత్వం, జీవితాలు డిజిటల్ గా మారాయని చెప్పారు. డిజిటల్ సిస్టం సురక్షితంగా ఉంటే మరింత అభివృద్ధి సాధిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రత విషయంలో పరిష్కారాల కోసం గూగుల్ సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నామని సీఎం చెప్పారు. ఈ సెంటర్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించడమే కాకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి, దేశ సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నామన్నారు. చెడు కలిగించొద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతంమనీ ఆ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు చెప్పారు. గూగుల్ సంస్థలాగే ప్రభుత్వం కూడా మంచి చేయాలన్న సిద్ధాంతాన్నే విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు.గూగుల్–హైదరాబాద్ పాత మిత్రులని సీఎం అభివర్ణించారు. హైదరాబాద్‌లో గూగుల్ 2007లో ప్రారంభమైందన్న సీఎం అందులో నేడు ఏడు వేల మంది పని చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు నైపుణ్యతలో శిక్షణ ఇవ్వడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో గూగుల్ గవర్నమెంట్ అఫేర్స్ – పబ్లిక్ పాలసీ వైస్-ప్రెసిడెంట్ విల్సన్ ఎల్ వైట్, గూగుల్ యాడ్ స్పేసెస్ వైస్-ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్ తో పాటు సంస్థ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
