Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం

  • టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి దామోదర్ హామీ

ముద్ర న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం అసెంబ్లీలోని ఛాంబర్ లో మంత్రి దామోదర్ రాజ నర్సింహాను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చించింది.అంతేకాకుండా వినతి పత్రాన్ని అందించింది.ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుకాక పోవడంతో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.అసలే ఆర్థిక కష్టాలతో జీవితాలు కొనసాగిస్తున్న జర్నలిస్టులకు, వైద్య ఖర్చులు మరింత భారంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అప్పులు చేసి జర్నలిస్టులు వైద్యం పొందే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.దీనిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కురి రాములు, రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి,ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు రజనీకాంత్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.