Take a fresh look at your lifestyle.

ఆత్మీయ భరోసాపై హైకోర్టులో పిల్ … గ్రామీణ కూలీలకే రైతు భరోసా

  • పట్టణాల్లో ఉంటున్న రైతుకూలీలకు ఇవ్వడం లేదు
  • నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ పిటిషన్
  • నాలుగు వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని రాష్ట్ర సర్కార్ కు హైకోర్టు ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలకు అడ్డంకులు మొదలయ్యాయి. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ రోజున మొదలైన ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం పథకం రూపొందించిందని, పట్టణ (మున్సిపాలిటీల పరిధి) రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో మొత్తంగా 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. గ్రామాల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి..మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. రైతు కూలీలు అందరూ సమానమేనని,ఎక్కడ ఉన్నా అందరూ కూలీలే అని పేర్కొన్నారు.కేవలం గ్రామాల్లోని రైతు కూలీలకే పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ అన్నారు. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.