Take a fresh look at your lifestyle.

తెలంగాణ అభివృద్ధి కోసం కలసి నడుద్దాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

– మీ సమస్యలు తెలుసు.. తప్పక పరిష్కరిస్తాం…
–నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లకు మంత్రి హామీ…
– ఆరంభమైన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 4వ నేషనల్ యం.సి, జి.సి సమావేశాలు

ముద్ర హైదరాబాద్ :

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఆధ్వర్యంలో 4వ నేషనల్ మేనేజింగ్ కమిటీ (MC), జనరల్ కౌన్సిల్ (GC) 2026 సమావేశాలు నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న పద్మజా పామ్ గ్రోవ్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ‘బిల్డర్స్ డే’ వేడుకలు, ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ రహదారుల నిర్మాణం నుంచి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఎదుర్కొనే సవాళ్లకు తాను ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని హామీ ఇచ్చారు.

స్వాతంత్ర్యానికి ముందే స్థాపించబడిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అత్యంత పురాతన సంస్థగా దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా సేవలందిస్తోందని ఆయన అన్నారు. ఈ సంస్థ కాంట్రాక్టర్లు మరియు ప్రభుత్వానికి మధ్య కీలక వారధిగా పనిచేస్తోందని కొనియాడారు. ఆర్థికాభివృద్ధికి రహదారులు, వంతెనలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, గృహ నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో అవసరమని, అందులో బిల్డర్లు, కాంట్రాక్టర్ల పాత్ర కీలకమని గుర్తు చేశారు.

తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో కొనసాగి, ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే క్యాబినెట్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ సేవలందించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఏడు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో కాంట్రాక్టర్లు, బిల్డర్ల సమస్యలు తనకు బాగా తెలుసని చెప్పారు.

ఇరిగేషన్ మంత్రిగా చెల్లింపులు, ఇతర సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఈ సమావేశాల్లో లేవనెత్తే అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో ఏర్పడిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘మేము గత పాలకుల్లా కాదు.. మీకు 24 గంటలూ అందుబాటులో ఉంటాం’’ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించడం ఆనందదాయకమని మంత్రి తెలిపారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపడానికి ఇలాంటి సమావేశాలు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌కు సహకారం అందిస్తున్న కెఎల్‌ఆర్, నర్సింహారెడ్డి తదితరులను అభినందించారు.

ఈ సమావేశాలకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ కంబో, ఐఎఫ్‌ఏడబ్ల్యూపీసీఏ బోర్డు సభ్యుడు ఎస్.ఎన్. రెడ్డి, బిఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డి.వి.ఎన్. రెడ్డి తదితరులు హాజరయ్యారు. నల్గొండ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఎస్. కృష్ణారావు, బిఏఐ మాజీ చైర్మన్ బి. సీనయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.