- కార్యకర్తలు కలిసిమెలిసి పని చేయాలి.
- తెలంగాణలో 45 లక్షల సభ్యత్వం బీజేపీకి ఉంది.
- బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే గెలుపని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో 45 లక్షల సభ్యత్వంతో పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం సీట్లు సాధించి ఎనిమిది సీట్లను బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేద్దామని కార్యకర్తలు, నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఈ మేరకు హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఈటల కాషాయ జెండా ఆవిష్కరించి, మాట్లాడారు.శ్రీరామనవమి దేశవ్యాప్తంగా ఎలా జరుపుకుంటున్నారో, అలాగే బీజేపీ జెండాల పండుగను గల్లీ గల్లీ జరుపుకుంటున్నామని అన్నారు. 1951, అక్టోబర్‌లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో జనసంఘ్ పార్టీ ఏర్పడిందన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో డెవలప్‌మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనే సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు. దేశ సంపద చివరి మనిషి వరకు అందించే కర్తవ్యాన్ని ప్రభుత్వాలు నిర్వహించాలని దీన్ దయాళ్ మార్గనిర్దేశం చేశారన్నారు. దేశానికి ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయమని అన్నారు.దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగి చీకటి అధ్యాయం ముగిసి సార్వత్రిక ఎన్నికలు జరిగితే అన్ని పార్టీల కలయికతో జనతపార్టీ ఎంత గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. ఆనాడు జనతా పార్టీ విఫలమై, ముక్కలైన తర్వాత వాజ్ పేయి, ఎల్.కె. అద్వానీ నాయకత్వంలో బీజేపీ కమలం పువ్వు గుర్తుతో ఆవిర్భవించిందని చెప్పారు. ఐదు సూత్రాలను ఆనాడే పార్టీలో పెట్టారన్నారు. ఆరోజుల్లో బీజేపీ నుంచి ఇద్దరు గెలిస్తే, ఒకరు గుజరాత్ నుంచి, హనుమకొండ నుంచి జంగారెడ్డి ఎంపీగా గెలిచారని ఎంపీ ఈటల తెలిపారు. ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించడం మామూలు విషయం కాదన్నారు.వాజ్‌పేయి నాయకత్వంలో మొదటి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.మచ్చలేకుండా దేశాన్ని పాలించిన గొప్పనేత వాజ్ పేయి అని కొనియాడారు. శాస్త్రవేత అబ్ధుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో 2జీ స్కామ్, భోఫోర్స్ స్కామ్, కోల్డ్ స్కామ్స్ జరిగి మంత్రులు జైలులో మగ్గారన్నారు. అయితే ప్రధాని మోడీ పాలనలో ఒక్క స్కామ్ కూడా లేకుండా ప్రపంచ చిత్రపటం మీద భారత్ జాతి గొప్పగా వెలిగిపోతుందన్నారు.ప్రపంచంలోనే ఐదో ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎరికి ఏ అవసరమున్నా సాయం చేసే పరిస్థితిలో ఉందన్నారు.సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకతో పాటు అపట్లో బెంగల్‌లో కరువు వస్తే భారత్ ఎంతో సాయం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, నేషనల్ హైవేలు ఒకటేమిటీ ఏ రంగంలోనైనా భారత్ ముందుకు దూసుకుపోతుందని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.
