Take a fresh look at your lifestyle.

కరీంనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించండి

  • ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించండి.
  • టీటీడీ బోర్డు ఛైర్మన్ నాయుడును కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.
  • సానుకూలంగా స్పందించిన టీటీడీ ఛైర్మన్.
  • అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ.

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో భూమిపూజ చేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్.నాయుడుని కోరారు. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ తిరుమలలో టీటీడీ ఛైర్మన్ నాయుడును కలిశారు. గతంలోనూ బండి సంజయ్ టీటీడీ ఛైర్మన్ ను కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మళ్లీ కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణ అంశాన్ని లేవనెత్తారు. భూమిపూజకే పరిమితమయ్యారని, ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వివరించారు. కరీంనగర్ లో శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని, వారి ఆకాంక్షలను ద్రుష్టిలో ఉంచుకుని యుద్ద ప్రాతిపదికన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.దీంతోపాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని పురాతన ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాల చరిత్రను బండి సంజయ్ వివరించారు. నిధుల్లేక ఈ చారిత్రక ఆలయాలు అభివ్రుద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆయా ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి సమగ్ర అభివ్రుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తక్షణమే టీటీడీ తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన టీటీడీ ఛైర్మన్ నాయుడు అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.