ముద్ర కుకట్‌పల్లి:
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోకి మద్యం, మత్తు పదార్థాల సరఫరాను అరికట్టాలని మరియు బయటి వ్యక్తుల వాహనాల పార్కింగ్‌ను తక్షణమే రద్దు చేయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం ప్రతినిధులు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్యాంపస్‌లో మద్యం, డ్రగ్స్‌ను పూర్తిగా నిషేధించాలి. అవసరమైతే ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేపట్టాలి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్యాంపస్‌ను ‘గ్రీన్ క్యాంపస్’గా మార్చాలి. ఇందుకోసం ప్రధాన ద్వారం వద్దే 100 సైకిళ్లను అందుబాటులో ఉంచి, విద్యార్థులు, అధ్యాపకులు లోపలికి వెళ్లేందుకు వాటినే వాడేలా చర్యలు తీసుకోవాలి.
బయటి వ్యక్తులు తమ వాహనాలను నెలల తరబడి క్యాంపస్‌లో పార్కింగ్ చేయడాన్ని నిలువరించాలి. విద్యార్థులు, అధ్యాపకుల వ్యక్తిగత వాహనాలను కూడా ప్రధాన ద్వారం వద్దే పరిమితం చేయాలి. మెట్రో ద్వారా వచ్చే వందలాది మంది విద్యార్థులు, అధ్యాపకుల సౌకర్యార్థం పాలనా భవనం ఎదురుగా ‘రివాల్వింగ్ గేట్’ ఏర్పాటు చేయాలి.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు జవాజి దిలీప్, రాహుల్ నాయక్ మాట్లాడుతూ.. యాజమాన్యం కేవలం సంఘటనలు జరిగిన తర్వాత శిక్షలు వేయడంపై కాకుండా, తప్పులు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. క్యాంపస్‌లో వాహనాల అతివేగం వల్ల గతంలో ప్రమాదాలు జరిగాయని, సైకిళ్ల వాడకం వల్ల అటు ఆరోగ్యం, ఇటు పర్యావరణం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీనివాసరావు, సాయి తనుజ్, శ్రీకాంత్, విశాల్, వసంత్, ప్రణయ్ చక్రవర్తి, ధీరజ్, జగదీష్, మరియు విద్యార్థి నాయకురాళ్లు సంగెం సిరి, లక్ష్మి, భావన తదితరులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.