తనపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం పిటీషన్
కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమన్న ధర్మాసనం
విచారణ ఈ నెల 21కి వాయిదా
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపాలపల్లి లో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, అభ్యంతరకర రీతిలో ఉన్నాయని గండ్ర..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కారణాలతోనే తనపై కేసులు పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. అయినా న్యాయస్థానం ఆ వాదనతో ఏకీభవించలేదు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.