రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నుంచి కొత్త పార్టీ
కవిత పార్టీ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్..?
సెంటిమెంట్లు లేని రాజకీయాలే
ఇప్పటికే కేటీఆర్, హరీశ్ పై గురి
కేసీఆర్ వ్యూహం లాగే.. కవిత వ్యాఖ్యలు
పేరు చెప్పకుండానే కేసీఆర్ పై విమర్శలు
ఇక నుంచి రాజకీయ సమరానికి శ్రీకారం..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేసీఆర్ కుటుంబం నుంచి కొత్త పార్టీ ఆవిష్కృతమవుతోంది. కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీని ప్రకటిస్తోంది. ఇప్పటికే కనిపించిన వాళ్లందరినీ.. గుర్తుకు వచ్చినవారందరినీ తూర్పారా పడుతున్న కవిత.. ఇప్పుడు కొత్త రాజకీయ వేదికపైకి వస్తోంది. మొన్నటిదాకా కేటీఆర్, హరీశ్, సంతోష్ వరకు వచ్చిన విమర్శనాస్త్రాలు.. ఇప్పుడిప్పుడే తండ్రి దాకా వస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాం మాదిరిగానే.. పేరు, ఊరు చెప్పకుండా కేసీఆర్ పై సైతం కవిత విమర్శలు మొదలుపెడుతున్నారు. ఇప్పుడు రాజకీయ వేదికపైకి వస్తుండటంతో.. ఇక విమర్శలు, సవాళ్లు నేరుగానే చేసే అవకాశాలు ఉన్నాయి. చూసుకుందామంటే.. చూసుకుందాం.. అన్నట్టే కవిత మాటలు ఉంటున్నాయి.
కొత్త పార్టీ.. కొత్త రాజకీయం
తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని గంటల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రక్రియలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కవిత తన రాజకీయ లక్ష్యం విషయంలో స్పష్టతతో ఉండటం. ఆమె వేస్తున్న ప్రతి అడుగు, ఎక్కుపెడుతున్న ప్రతి విమర్శ కేవలం ఒకే ఒక్క దిశగా సాగుతున్నాయి. అదే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడమే ఇప్పుడు కవిత ముందున్న అతి పెద్ద రాజకీయ సవాల్. బీఆర్ఎస్ కు ఎంత నష్టం చేస్తే.. రాజకీయంగా అంత ఎదిగినట్టుగా కవిత భావిస్తున్నారు. ఎందుకంటే స్వయంగా కవిత కూతురు అయినా.. కొంతమంది కీలకం అనుకున్న నేతలు కవితను బీఆర్ఎస్ లోనే తొక్కి పెట్టారు. అదే ఇప్పుడు అసలు కోపం అంతా.
అసలు టార్గెట్ కాంగ్రెస్, బీజేపీ కాదు.. బీఆర్ఎస్సే!
సాధారణంగా కొత్త పార్టీలు అధికార పార్టీని విమర్శించడం ద్వారా ఉనికిని చాటుకుంటాయి. కానీ కవిత మాత్రం అధికార కాంగ్రెస్‌ను , దూకుడుగా ఉన్న బీజేపీని కాకుండా, బీఆర్ఎస్ మీదనే ఎక్కువ దృష్టి సారించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు సిద్ధాంతపరంగా ఆమె వైపు వచ్చే అవకాశం లేదని, అలాగే బీజేపీ హిందూత్వ ఓటు బ్యాంకు తన దరి చేరదని ఆమెకు బాగా తెలుసు. అందుకే, గత పదేళ్లుగా బీఆర్ఎస్ వెన్నంటి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును, ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న శ్రేణులను తన వైపు తిప్పుకోవడమే ఆమె సింగిల్ పాయింట్ అజెండా గా కనిపిస్తోంది.
కారుకు బ్రేకులు వేసే వ్యూహం
బీఆర్ఎస్ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కవిత ఎంట్రీ ఆ పార్టీకి పెనుగండంగా మారేలా ఉంది. బీఆర్ఎస్ వైఫల్యాలను, ముఖ్యంగా మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఆమె పదే పదే ప్రస్తావిస్తుండటం యాధృచ్ఛికం కాదు. రేపు జరగబోయే ఆవిర్భావ సభలో కూడా ఆమె ప్రసంగం బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకునే సాగే అవకాశం ఉంది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, తెలంగాణ ఆకాంక్షలను మోసే స్వతంత్ర గళంగా తనను తాను ఆవిష్కరించుకోవడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్‌లో చీలిక తీసుకురావడమే ఆమె అసలు ప్లాన్.
రాజకీయ ఉనికి కోసం పోరాటం
నేటి రాజకీయాల్లో కేవలం సెంటిమెంట్‌తోనే ఓట్లు పడవని గుర్తించిన కవిత, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలహీనపడిన చోట తన పట్టును పెంచుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెల్లాచెదురైతే, అది కాంగ్రెస్‌కో లేదా బీజేపీకో వెళ్లకుండా తన కొత్త పార్టీ ఒక షెల్టర్ లాగా ఉపయోగపడాలని ఆమె ఆశిస్తున్నారు. ఈ వ్యూహం గనుక పారితే, బీఆర్ఎస్ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, బీఆర్ఎస్ పునాదుల మీదనే తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవాలని కవిత గట్టి నిర్ణయానికి వచ్చారు.
చూసీచూడనట్టు రాజకీయ సమరం
రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు.. కేవలం బాధ్యతలే ఉంటాయి అనే సంకేతాన్ని కవిత ఇప్పటికే ఇచ్చారు. కేసీఆర్ అనుసరించిన కొన్ని విధానాలను ఆమె బహిరంగంగానే తప్పుపట్టడం ద్వారా, తాను బీఆర్ఎస్ బి-టీమ్ కాదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిర్భావ సభ తర్వాత ఆమె చేపట్టబోయే కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. ఇది కచ్చితంగా గులాబీ దళానికి ఒక హెచ్చరిక లాంటిదే. కవిత రాజకీయ చదరంగంలో తొలి పావును అత్యంత తెలివిగా కదిపారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలను వదిలేసి, తన సొంత ఇంటి ఓటు బ్యాంకుపైనే ఆమె యుద్ధం ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. రేపటి సభలో ఆమె ప్రకటించబోయే పార్టీ పేరు, విధివిధానాలు బీఆర్ఎస్ భవిష్యత్తును ఏ మేరకు ప్రభావితం చేస్తాయోనన్న ఆందోళన ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కవిత కొత్త ప్రయోగం’ విజయవంతమైతే, తెలంగాణలో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం అత్యంత కష్టతరంగా మారవచ్చు.