Take a fresh look at your lifestyle.

సీఎంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసహనం

నా వాళ్లే నా గొంతు కోద్దామని చూస్తున్నరు
పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారు
మున్సిపల్‌ ఎన్నికల్లో నా వాళ్లకు టికెట్లు తక్కువ ఇచ్చారు
ముద్ర, జగిత్యాల :

సొంత పార్టీ నేతలే తన గొంతు కోద్దామని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. నా గొంతు కోయాలంటే ముందు నా కార్యకర్తలను దాటి రావాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన తనకు.. రాజకీయాల్లో చివరి రోజుల్లో బాధపెడుతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం జగిత్యాలలో ఆయన పార్టీ కార్యకర్తల ముందు కన్నళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న మున్సిపల్‌ ఎన్నికల్లో తన వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని ఆవేదన చెందారు. అదే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన సీఎం అయ్యాక ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాదిరిగా ఎవరినీ రాళ్లతో కొట్టొద్దన్న జీవన్ రెడ్డి.. వారిని ఓట్లతో కొడదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ తన వర్గాన్ని పక్కనపెట్టి.. తనతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సంజయ్‌ కుమార్‌ తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్‌ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా అంటూ సంజయ్‌ కాంగ్రెస్‌ జెండాను ఎత్తుకుపోయాడని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో దొంగలు పడ్డారని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.