టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ అంశంపై పాక్ తన వైఖరిని స్పష్టం చేసినప్పటికీ, ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని కోరుతూ పాకిస్థాన్‌కు లేఖ రాసినట్లు సమాచారం.
ఈ టోర్నీకి సంయుక్త ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక, భారత్–పాక్ మ్యాచ్‌కు అపారమైన ఆదరణ ఉందని లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికే ఆ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని పేర్కొంది. ఈ మ్యాచ్ టోర్నీలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పోరాటంగా ఉందని, పాకిస్థాన్ ఆడకపోతే క్రికెట్ బోర్డులకు భారీ ఆర్థిక నష్టం తప్పదని స్పష్టం చేసింది. పర్యాటక ఆదాయం తగ్గడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశముందని తెలిపింది. ఈ నష్టం కేవలం శ్రీలంకకే పరిమితం కాదని, ఇతర వాటాదారులపై కూడా ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొంది.
గతంలో పాకిస్థాన్‌కు శ్రీలంక క్రికెట్ ఇచ్చిన సహకారాన్ని కూడా ఎస్‌ఎల్‌సీ గుర్తు చేసింది. భద్రతా కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇతర జట్లు వెనకడుగు వేసిన సందర్భాల్లోనూ తమ జట్టు అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు ఆడిందని వివరించింది. ఆ నిర్ణయాలు క్రీడాస్ఫూర్తి, పరస్పర గౌరవ భావంతో తీసుకున్నవని తెలిపింది. ఇప్పుడు పాకిస్థాన్ నుంచి కూడా అదే తరహా స్పందన ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. తమ దేశంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు పటిష్టమైన భద్రత ఉంటుందని శ్రీలంక బోర్డు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ముందుకు వెళ్తుందని తెలిపారు. పాకిస్థాన్ ఆడకపోయినా, భారత్ మాత్రం నిర్ణీత సమయానికి కొలంబోకు చేరుకుంటుందని చెప్పారు. మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు, హోటల్ బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయని కెప్టెన్ల సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్–పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారత్‌తో మాత్రమే మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. మిగతా జట్లతో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఆడతామని పాక్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి కారణాన్ని వెల్లడించకపోవడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మెగా టోర్నీలో ఎంపిక చేసుకుని మ్యాచ్‌లను బహిష్కరించడం సరికాదని పాక్‌కు స్పష్టం చేసింది. అన్ని బోర్డుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఐసీసీ సూచించింది.
గ్రూప్ దశలో భారత్ మ్యాచ్‌లు
ఫిబ్రవరి 7: యూఎస్ఏ
ఫిబ్రవరి 12: నమీబియా
ఫిబ్రవరి 15: పాకిస్థాన్
ఫిబ్రవరి 18: నెదర్లాండ్స్
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, శివమ్ దూబే, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్