Take a fresh look at your lifestyle.

వివాదాల నడుమ తహసీల్దార్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం – ఇరు వర్గాలను పక్కన పెట్టిన అధికారులు

 

ముద్ర,గద్వాల:

మల్దకల్‌ మండలం పెద్దపల్లి గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్వహించాల్సిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం గురువారం రాజకీయ రంగు పులుముకుంది. గురువారం కల్యాణోత్సవాన్నీ మేమే నిర్వహిస్తామని ప్రస్తుత సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్ వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపైనొక్కరు అధికారులకు ఫిర్యాదు చేసుకోవడంతో గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు‌.
కల్యాణోత్సవ నిర్వహణలో పైచేయి సాధించేందుకు ఇరువర్గాలు పట్టుబట్టడంతో, భక్తుల మనోభావాలను మరియు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన ఇరు వర్గాలను పక్కన పెట్టి, నేరుగా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే కల్యాణాన్ని నిర్వహించాలని జిల్లా‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
​శుక్రవా‌రం శ్రీరామనవమి పురస్కరించుకుని పెద్దపల్లి గ్రామంలో శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో
మల్దకల్‌ తహసీల్దార్ ఝాన్సీ దంపతులు స్వయంగా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి శ్రీ సీతారాముల స్వామి వారి కల్యాణోత్స. కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్దకల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయాలకు తావులేకుండా కేవలం భక్తిశ్రద్ధలతో ఉత్సవం నిర్వహించడం పట్ల సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
​ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఆలయ పూజారులు మరియు గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.