ముద్ర, స్పోర్ట్స్ డెస్క్:
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టోర్నీ ఆరంభంలో ఎదురైన వైఫల్యాల నుంచి తిరిగి నిలబడడంలో ముగ్గురు వ్యక్తుల మద్దతు కీలకమని అభిషేక్ వెల్లడించాడు.
ఆరంభంలో వరుస డకౌట్లు
టోర్నీకి ముందు మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, ప్రారంభ మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు అయ్యాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లో 52 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు.
గంభీర్, సూర్యకుమార్, యువరాజ్ అండ
తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన వారిలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మెంటర్ యువరాజ్ సింగ్ ఉన్నారని అభిషేక్ తెలిపాడు. గంభీర్ జట్టు నుంచి పూర్తి మద్దతు అందించారని పేర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ల తర్వాత కూడా సహజ ఆట ఆడమని సూచించాడని చెప్పాడు. యువరాజ్ సింగ్ తరచూ మాట్లాడి ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని వివరించాడు.
ప్రపంచకప్ ఇచ్చిన పాఠం
ఈ టోర్నీ తనకు మానసిక దృఢత్వం ఎంత అవసరమో నేర్పిందని అభిషేక్ పేర్కొన్నాడు. మంచి ప్రదర్శనతో అతిగా ఉత్సాహపడకుండా, వైఫల్యాల సమయంలో నిరాశ చెందకుండా సమతుల్యంగా ఉండటమే ముఖ్యమని తెలిపాడు.
ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించిన అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.