మళ్లీ పాత రూట్‌లోకి వచ్చిన పెద్దపులి!
ఫారెస్ట్ అధికారుల ముప్పు తిప్పలు – ఫలితం లేని ట్రాకర్లు, బోన్లు
ముద్ర, తుర్కపల్లి:తుర్కపల్లి మండలంలో పెద్దపులి సంచారం మళ్లీ మొదలైనట్లు సమాచారం రావడంతో గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామం పెట్రోల్ బంక్ సమీపంలోని నాగదేవత గుడి వద్ద రాత్రి సుమారు 1:40 గంటల సమయంలో అడవిపందిని వేటాడుతూ దయ్యబండ రూట్ అడవి వైపు పులి కదలాడినట్లు ఓ టిప్పర్ లారీ డ్రైవర్ కళ్లారా చూసినట్టు తెలిపాడు.

ఈ సంఘటనతో పులి తన పాత రూట్‌లు, పాత అడ్డాలు వైపే తిరిగి వచ్చి, గతంలో తిరిగిన ప్రాంతాల్లోనే మళ్లీ మకాం వేయడానికి రిటర్న్ అవుతున్నట్టు అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా పొదల చాటున మాటువేసి ఉండే అవకాశముండటంతో క్షణక్షణం అప్రమత్తత అవసరమని అధికారులు, గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు.

13 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ – అయినా చిక్కని పెద్దపులి
గత 13 రోజులుగా ఫారెస్ట్ అధికారులు ట్రాకర్‌లతో గాలింపు, బోన్ల ఏర్పాటు, రాత్రి పహారా వంటి చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. పులి చిక్కకుండా తప్పించుకుంటూ ఉండటంతో ఆపరేషన్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆవులు, దూడలపై పులి దాడులు జరిగినట్టు సమాచారం ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ పశువులను బావుల వద్ద కట్టేసే రైతులు, మేతకు తీసుకెళ్లే వారు మరింత జాగ్రత్తలు పాటించాలని సూచనలు వెలువడుతున్నాయి.

బి-అలర్ట్ ప్రాంతాలు
దయ్యబండ తండా – మంచిరోని మామిల్లు – ఇబ్రాహింపురం – దత్తాయపల్లి – కోనాపూర్ – తీర్మాలపురం ప్రాంతాలను బి-అలర్ట్ జోన్‌గా పరిగణిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అవసరం లేనిప్పుడు రాత్రివేళ బయటకు వెళ్లకూడదని, ఒంటరిగా ప్రయాణాలు నివారించాలని సూచిస్తున్నారు.
ప్రజలకు సూచనలు
రాత్రివేళ పొదలు, అడవి అంచుల వద్దకు వెళ్లకండి
పశువులను సమూహంగా, వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కట్టండి
అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వండి
గ్రామస్థులు పరస్పరం సమన్వయంతో అప్రమత్తంగా ఉండండి
పులి సంచారం వల్ల తుర్కపల్లి మండల ప్రజలు భయాందోళనలో ఉన్న వేళ, త్వరిత చర్యలు తీసుకుని పెద్దపులిని పట్టుకోవాలని తుర్కపల్లి మండల ప్రజల తరఫున గట్టి డిమాండ్ వినిపిస్తోంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.