తమిళనాడు తరహాలో మహిళా పోలీసుల నియామకం,శిక్షణ
పద్దతుల అధ్యయనానికి ప్రత్యేక బృందం ఏర్పాటు
కార్యాచరణపై సమగ్ర నివేదిక ఇవ్వండి
రాష్ట్ర పోలీసింగ్‌లో మహిళల భాగస్వామ్యం అయ్యేలా చర్యలు
పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఉమెన్ కాన్ఫరెన్స్ ఫర్ పోలీస్, పోలీస్ అకాడమీ యాన్యువల్ మ్యాగజైన్ ఆవిష్కరణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ శాఖల్లో మహిళల నియామకం,శిక్షణలపై ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి.. ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర పోలీసింగ్‌లో మహిళల భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టాలనీ.. దీనికి సంబంధించిన కార్యాచరణపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ ఉమెన్ కాన్ఫరెన్స్ ఫర్ పోలీస్, పోలీస్ అకాడమీ యాన్యువల్ మ్యాగజైన్ –2025ను సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ పోలీసింగ్, శాంతిభద్రతలు, దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ బందోబస్తు విధుల్లో మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. ఆర్‌బివిఆర్ఆర్ టిజిపిఎ ఆధ్వర్యంలో తెలంగాణ ఉమెన్ కాన్ఫరెన్స్ ఫర్ పోలీస్ సదస్సును నిర్వహించడం, చర్చలు, సిఫార్సులను పుస్తక రూపంలో విడుదల చేయడాన్ని సీఎం అభినందించారు. పోలీసింగ్‌లో మహిళలను బలోపేతం చేయడానికి ఐదు కీలక ప్రాధాన్యతలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ వివరించారు. ప్రత్యేక విశ్రాంతి గదులు, క్రెచ్ సౌకర్యాలు, బందోబస్తు సమయంలో మొబైల్ టాయిలెట్ యూనిట్లు, మహిళల పెట్రోలింగ్‌ను పెంచడానికి తగిన సంఖ్యలో స్కూటర్లను అందించడం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల చేయాలని తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, లా అండ్ ఆర్డర్, బందోబస్త్‌లలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని వివరించారు. యూనిఫాం కంఫర్ట్ మార్గదర్శకాలను పరిశీలించాలని, జండర్ ఈక్వేషన్ కూడా పరిగణించాలని తెలిపారు. ఈ అంశాల కార్యాచరణ కోసం డీజీపీ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఐపిఎస్ అధికారులు శిఖా గోయల్ , స్వాతి లక్రా , చారు సిన్హా, విజయ్ కుమార్ , శ్వేత పాల్గొన్నారు.