పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ముద్ర, నిజామాబాద్ :
నిజామాబాద్ కార్పొరేషన్ పాలక వర్గం పదవి కాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని స్ధానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకుండానే ఇక్కడ బీజేపీని మేయర్ పీఠం ఎక్కిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో బీజేపీ మేయర్ పీఠం చేజారిందన్నారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీని స్వల్ప మెజారిటీతో ఓడించాయన్నారు. సోమవారం నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ కు వచ్చిన అక్బరుద్దీన్ హిందువులను దూషించినా ఆత్మభిమానాన్ని అంతా చంపుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసిపోయాయని మండిపడ్డారు. కరీంనగర్‍లో మేయర్ ఓటింగ్‍కు దూరంగా ఉన్న బీఆర్ఎస్ నిజామాబాద్‍లో మాత్రం కాంగ్రెస్‍కు మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ బీఆర్ఎస్ కు కరీంనగర్ మీదనే ఎందుకు ప్రేమ ఉంది నిజామాబాద్ పై ఎందుకు లేదో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిని నార్కో పరీక్షలు నిర్వహిస్తే నిజం చెప్తారేమో అన్నారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ కాపాడుతున్నడు
కాళేశ్వరం, ఈ కార్ రేస్ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు?, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ ఎందుకు కాలిపోతుంది అనేది ఈ పొత్తులతో తేలిపోయిందని ఎంపీ అర్వింద్ వెల్లడించారు. నిజామాబాద్ లో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. కొంత మంది పోలీసులు రంగుపులుముకుని వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్‍కు మద్దతు ఇచ్చేలా పోలీసులు చేశారని ఆరోపించారు.