ముద్ర కూకట్‌పల్లి :
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. జేఎన్టీయూలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థి నేతలు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గారికి పోస్టుకార్డులు పంపిస్తూ తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఫీజులు విద్యార్థులే చెల్లించాలన్న తీర్పును సాకుగా చూపి కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయని నేతలు జవ్వాజీ దిలీప్, రాహుల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల విద్యార్థులు లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్న విద్యాశాఖ
అధికారులను, ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ, తక్షణమే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాగర్ నాయక్, రాజ్ కుమార్, రుత్విక్, ధనుంజయ్ సహా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.