- నేను మంత్రిగా ఉంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు.
- నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు.
- టీడీపీలో నడిపించుకున్నట్లు ఇక్కడా నడిపించాలంటే కుదరదు.
- నా కూతురికి అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదు.
- మీ కూతురికి ఉంది కాబట్టి ఎంపీ అయింది.
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
- సీఎం, మంత్రి పొంగులేటి వద్ద నాపై ఫిర్యాదు చేస్తున్నాడు.
- గోదావరి పుష్కరాలకు ఏపీ, తెలంగాణకు సమాన నిధులివ్వాలి.
- ఆ పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయి.
- కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ఆ నిధులు తేవాలి.
- మీడియాతో మంత్రి కొండా సురేఖ చిట్ చాట్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తనను మంత్రి హోదాలో చూసి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కళ్లు మండుతున్నాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ స్ధాయి ఉండడాన్ని ఆయన ఓర్వేలేకపోతున్నారని విమర్శించారు. తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారన్నారు. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం వరంగల్ లో ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. తరచూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్తున్న కడియం శ్రీహరి తనపై ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు చాలా ఎక్కువే చేశారన్నారు.ఆ పార్టీలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్‌లో అలా నడవదని తేల్చి చెప్పారు. నాకు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యాననీ చెప్పిన మంత్రి ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యారని గుర్తు చేశారు. తరచూ నేను దిగిపోవాలని మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు.. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది అని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త కొండా మురళికి వ్యతిరేకంగా పలువురు నేతలతో భేటీ అయిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి సురేఖ గట్టి కౌంటర్ ఇచ్చారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదని స్పష్టం చేశారు. కొందరు తమ సొత్తు అన్నట్లు భావిస్తున్నారని మండిపడ్డారు. నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదన్న ఆమె.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ అమ్మవారు శాఖాహారి అని అందరికీ తెలుసన్నారు.అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నామన్నారు. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు.గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. పుష్కరాలకు రూ.200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయన్న ఆమె భద్రాచల రాముడి పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఈ విషయంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ చొరవ తీసుకోవాలన్నారు. తెలంగాణకు పుష్కరాల నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.