- అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు టీపీసీసీ చీఫ్ వార్నింగ్.
- కొండా మురళీ వ్యాఖ్యలపై సీరియస్.
- ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి.
- విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్టీ, పార్టీలోని నాయకుల గురించి హద్దులు దాటి విమర్శలు చేస్తే చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధికార పార్టీ నేతలు, కీలక నేతలను హెచ్చరించారు. ఒకరి శాఖల గురించి మరో మంత్రి మాట్లాడటానికి వీళ్లేదని పునరుద్ఘాటించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఇటీవల మందలించిన ఆయన ఈ నెల 19న ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి మరోసారి స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో కొండా మురళీ వర్సెస్ మిగతా ఎమ్మెల్యేలు, కీలక నేతల మధ్య భగ్గుమన్న విభేదాలను సీరియస్ గా తీసుకున్నట్లు వెల్లడించారు.ఆ జిల్లాలో ఇరువర్గాల గురించి ఫిర్యాదులు అందాయని చెప్పారు.అక్కడ నెలకొన్న పరిస్థితులకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్టును అందజేయాలని పరిశీలకులకు సూచించినట్లు తెలిపారు.ఆ రిపోర్టు అందగానే క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయని పేర్కొన్నారు. పార్టీలో ఎవరి ఇష్టారీతిన వారు మాట్లాడవద్దని సూచించారు. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో తానే బరిలో ఉన్నానంటూ మరో కీలక నేత అజారొద్దీన్ చేసిన ప్రకటనపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆ ఉప ఎన్నికలో ఎవరిని బరిలో దింపాలనేది పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ తాను ఎమ్మెల్యే బరిలో ఉన్నట్లు ప్రకటించుకోవడాన్ని తప్పుబట్టడం లేదన్నారు. ఆయన గతంలో అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి మళ్లీ పోటీకి ప్రయత్నిస్తున్నారు.. ఇందులో తప్పేం లేదని అన్నారు.