ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా కొండ కింద ఉన్న శ్రీ వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం గోవింద నామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ గావించారు.

గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు మంచి నీరు మజ్జిగ అందించి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అర్చక స్వాములుసుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు చేశారు. విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించి స్వామివారి రథోత్సవ సేవ ఆదిమధ్యాంతరహితుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో రధం పై శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి రథోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.