- కీలక బాధితులు రేవంత్ రెడ్డిని విచారించనున్న సిట్.
- టీపీసీసీగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ రేవంత్ ఫిర్యాదు.
- సీఎం, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోనున్న అధికారులు.
- కొనసాగుతోన్న బాధితుల నుంచి వాంగ్మూలం రికార్డింగ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. గత ప్రభుత్వం తన ఫోన్లతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేసిందని ఆ సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను తీసుకోవాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు పాత్రలపై మరింత లోతుగా విచారణ జరిపి వీలైనంత త్వరగా వీరిద్దరిపై చార్జి షీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇటీవల విచారించిన పోలీసులు..ఎన్నికల ముందు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ ను ప్రణీత్ రావు లీడ్ చేయడంతో పాటు రాజకీయ నేతలు, ప్రముఖల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా ప్రణీత్ రావును మరింత లోతుగా విచారిస్తున్నారు. మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
- బాధితుల వాంగ్మూలం రికార్డ్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు బాధితుల వాంగ్మూలం రికార్డ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ బాధితులు వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరిగా బాధితుల నుంచి వాంగ్మూలాన్నిసేకరిస్తోన్న దర్యాప్తు అధికారులు బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును మరోసారి విచారించాలని సిట్ భావించింది. ఈ నెల 17న ప్రభాకర్ రావును విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి సాక్షిగా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉండటంతో ప్రభాకర్ రావు విచారణను నేడు వాయిదా పడింది. తాజాగా బుధవారం విచారణకు హాజరైన ప్రణీత రావు పలు డాక్యుమెంట్లను సిట్ అధికారులకు అందజేశారు. ఇందులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడం ఈ దర్యాప్తు కీలకంగా మారింది. దీంతో ఎవరు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారు..హార్డ్ డిస్క్ మాయం చేయడంలో ఎవరి పాత్ర ఉంది అనే సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభాకర్‌రావు నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఈ విషయంపై సిట్ పోలీసులు ప్రణీత్ రావును విచారించారు.