బోడుప్పల్, ముద్ర ప్రతినిధి:
వసంత పంచమి అనేది హిందూ పంచాంగం ప్రకారం.. శుక్ల పక్షం పంచమి తిథి నాడు వచ్చే పవిత్ర పండుగ. జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి కళలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ రోజు పూజించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు వసంత ఋతువుని ప్రారంభంగా కూడా పరిగణిస్తారు. విశేష పర్వదినాల మాసమైన మాఘమాసంలో తొలిగా వచ్చే ప్రముఖ పర్వదినం వసంతపంచమి లేదా శ్రీపంచమి. ఈ రోజుతోనే పర్వదినాలు ప్రారంభం అవుతాయి. చదువుల తల్లి సరస్వతీ దేవి ఈ వసంత పంచమి రోజే జన్మించిందని పండితులు చెబుతారు. ఇంతటి ఉతృష్టమైన వసంతపంచమి పర్వదినం సందర్భంగా బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి అమ్మవారు సరస్వతీ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వసంత పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానం, విద్యాబుద్ధులు వికసించి భవిషత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. వసంత పంచమి సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు విశేష అలంకరణలో మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి రూపంలో దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకులు ఉమాకాంత శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అమ్మవారి గర్భగుడిని, అమ్మవారిని అత్యంత అద్భుతంగా సువాసనలు వెదజల్లే పూలతో అలంకరించారు.
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ మాతా నిమిషాంబికా అమ్మవారిని కనులారా వీక్షించి, ఆమె కరుణాకటాక్షాలు పొందడానికి శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శన సమయంలో ఏవిధమైన అసైకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్ , ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, ఎస్. శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు, ట్రస్ట్ ధర్మకర్తలు బి. హేమచందర్, డి.నర్సింగ్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), వై.చంద్రశేఖర్, ఎన్. శ్రీధర్ కె. ప్రవీణ్ కుమార్ అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోనే వుండి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వలంటీర్ల సహకారంతో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, అర్చకులు ఉమాకాంత్ శర్మ భక్తులతో విశేష పూజాదికాలు చేయిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆధ్యాత్మిక విజ్ఞానానికి, మానసిక శాంతి, సృజనాత్మకత, అందుతాయని భక్తుల విశ్వాసం… అమ్మ దయ ఉంటే అన్నీఉన్నట్లే.