Take a fresh look at your lifestyle.

శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ట్రాఫిక్ ఆంక్షలు

 

ముద్ర మల్కాజిగిరి

కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 15 వ తేదీన నిర్వహించనున్న మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని జవహర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు మల్కాజిగిరి జోన్ ట్రాఫిక్ డిసిపి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఆరు రోజుల పాటు భారీ వాహనాల రాకపోకలను మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.
భారీ వాహనాల మళ్లింపులు ఇలా…
ఓ ఆర్ ఆర్ లేదా చేర్యాల్ క్రాస్ రోడ్ నుండి వచ్చే భారీ వాహనాలను కీసర గ్రామం వైపు అనుమతించరు. వాటిని కీసర ఓ ఆర్ ఆర్ వద్ద ఘట్కేసర్ లేదా షామీర్‌పేట్ వైపు ఓ ఆర్ ఆర్/సర్వీస్ రోడ్డు ద్వారా మళ్లిస్తారు.
ఉద్దేమర్రి, బొమ్మలరామారం ప్రాంతాల నుంచి కీసర గ్రామం క్రాస్ రోడ్ వైపు వచ్చే భారీ వాహనాలను అనుమతించరు. వాటిని రంగాపురం చౌరస్తా వద్ద ఉద్దేమర్రి–రంగాపురం చౌరస్తా, బొమ్మలరామారం మార్గాల ద్వారా మళ్లిస్తారు. ఇదే విధంగా తిరుగు ప్రయాణ వాహనాలకూ ఈ మార్గమే వర్తిస్తుంది.
షామీర్‌పేట్ నుండి కీసర గ్రామం క్రాస్ రోడ్ వైపు వచ్చే భారీ వాహనాలను యాద్గరిపల్లి వద్ద మళ్లించి, అక్కడి క్రాస్ రోడ్ ద్వారా ఘట్కేసర్ వైపు కుడి మలుపు తీసుకుని ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్డు లేదా చేర్యాల గ్రామం మీదుగా ఈసీఐఎల్ వైపు దారి మళ్లిస్తారు.
బోగారం నుండి కీసర విలేజ్ క్రాస్ రోడ్ల వైపు వచ్చే భారీ వాహనాలను వన్నెగూడ క్రాస్ రోడ్ వద్ద మళ్లించి, కీసర దయారా మీదుగా ఓ ఆర్ ఆర్ వైపు పంపించి, అక్కడి నుంచి ఘట్కేసర్ లేదా షామీర్‌పేట్ వైపు మళ్లిస్తారు.
పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పౌరులు సూచించిన మార్గాలను గమనించి తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకుని రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.