ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి మంత్రి పదవి ఇస్తే పార్టీకి రాజీనామా చేసేవారా..?-మాజీమంత్రి జీవన్ రెడ్డిపై డిసిసి అధ్యక్షులు నందయ్య ఘాటు విమర్శలు…
జగిత్యాల ఇందిరా భవన్ తప్ప, గాంధీ భవన్ తెలియదు…
కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి తక్కువ చేసింది….?
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఎమ్మెల్సీ రెన్యువల్ చేసి, మంత్రి పదవి ఇచ్చి ఉంటే మీరు పార్టీకి రాజీనామా చేసేవారా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ నాకే పదవి అవసరం లేదని, పార్టీ జెండా మోసిన నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న మీరు అన్ని రకాల అర్హతలు ఉన్న నాకు మంత్రి పదవి నాకు ఎందుకు ఇవ్వలేదని అనడం చూస్తే అసలు విషయం బోధపడుతుందన్నారు. ఏనాడు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా మీరు ఊరి పొలి మేర కూడా దాటనివ్వలేదని, జగిత్యాల లోని ఇందిరా భవన్ తప్ప, గాంధీ భవన్ తెలియదని ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అవ్వకముందు కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో వెంటిలేటర్ పై ఉందని, దాన్ని రేవంత్ రెడ్డి ప్రాణాలతో బ్రతికించాడని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీని విమర్శించిన మీరు ఈరోజు కాలేశ్వరం లేకపోతే తెలంగాణనే లేదు అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కేవలం నెల రోజులలోనే బిఆర్ఎస్ పార్టీపై మీకెందుకు ఇంత ప్రేమ వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. నాలుగు దశాబ్దాలుగా నేను మీ వెంటే ఉన్నా, పార్టీ ఎన్నడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. చాలా గౌరవంగానే చూసిందని, నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఏ అభ్యర్థికి CMRF లాగిన్ మీకు తప్ప ఎవరికి ఇవ్వలేదు. అది పార్టీ గౌరవించడం కాదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ప్రభుత్వం ఎందుకు దిగిపోవాలి..? పాత పథకాలతోపాటు కొత్త సంక్షేమ పథకాలు అమలు చేసినందుకా..? అని అన్నారు. మీ అనుచరులు డిసిసి అధ్యక్షుడు రూ.20 లక్షలకు కౌన్సిలర్ టికెట్ అమ్ముకున్నాడని విమర్శిస్తే మీరు ఎందుకు వారించలేదు..? నాలుగు దశాబ్దాలుగా నా నిబద్దత మీకు తెలియదా..? అని పేర్కొన్నారు. గతంలో 4 పర్యాయాలు సర్పంచిగా ఉండి, నాకు ఎంపీపీ అవకాశం వస్తే పార్టీ జెండా ఎన్నడూ పట్టని వారికి ఎంపీపీ ఇవ్వలేదా? ఈ రోజు జెండాలు మోసేవారు గుర్తుకు వచ్చారా? అని అన్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని కాంగ్రెస్ పార్టీతో మీరు కలిసి పని చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గట్టు సతీష్, రవీందర్ రెడ్డి, మన్సూర్, తెర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.