ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణ పక్ష అమావాస్య శనివారం సందర్భంగా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శని గ్రహ దోష నివారణార్థం భక్తులు స్వామివారికి తిలతైల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామివారికి ప్రత్యేక అష్టోత్తర పూజలు, అర్చనలు, తిలతైలాభిషేకాలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందారని తెలిపారు. ఈ మాసంలో స్వామివారిని ఆరాధించిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. జన్మ రీత్యా, గోచార రీత్యా శని గ్రహ దోష నివారణకు ప్రతి ఒక్కరూ స్వామివారిని భక్తితో పూజించాలని సూచించారు.
అలాగే ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలానికి చెందిన బ్రహ్మసూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి వేద ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరాచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.