Take a fresh look at your lifestyle.

గాంధీభవన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం కేంద్రమంత్రి బండి సంజయ్

రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం వ్యభిచారం చేస్తుంది
పార్టీ మారినట్లు అన్ని ఆధారాలున్నా క్లీన్ చీట్ ఇస్తున్నారు
అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం వరదల్లా నిధులిస్తోంది

ముద్ర, సిరిసిల్ల :

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిసన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ రాజకీయం వ్యభిచారం చేస్తుందని మండిపడ్డారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు అన్ని ఆధారాలున్నా స్పీకర్ ఒక్కొక్కటీగా కేసులను కొట్టి వేయడం దారుణమన్నారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమౌతుందని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో కొనసాగుతూ ఆ మచ్చతో చరిత్రహీనులు కావద్దని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించిన పార్టీ స్ట్రీట్ కార్నర్ సమావేశంలో బండిసంజయ్ పాల్గొన్నారు. ఈ పందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం వరదల్లా నిధులిస్తే, ఆ నిధులను మాజీ మంత్రి కేటీఆర్ పక్కదారి పట్టించాడని కేంద్రమంత్రి ఆరోపించారు. ఆ నిధులతో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్ల పట్టణాన్ని వరదల్లో మునిగేలా చేశాడని కేటీఆర్ పై మండిపడ్డారు. పార్టీలో, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ సిరిసిల్లను నాశనం చేశాడని విమర్శించారు. వర్షాకాలం వరదలు వస్తే సిరిసిల్లలో పలు కాలనీలతో పాటు ఇటీవల నిర్మించిన కలెక్టరేట్ కూడా నీట మునగడం మనం కళ్లారా చూశామన్నారు. జిల్లా కలెక్టర్ ట్రాక్టర్‌లో ఆ జలదిగ్భందం నుంచి బయటపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి తనపై వేల కేసులు పెట్టించిన కేటీఆర్.. ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ నువ్వు చేసిన అరాచకాలు నీచ పనులన్నీ బయట పెడతానని హెచ్చరించారు. తన జోలికి వస్తే, నీ బతుకు రోడ్డుకీడుస్తానంటూ ధ్వజమెత్తారు. సిరిసిల్లలో మొత్తం వస్త్ర పరిశ్రమ ఉంటే, కేవలం కమిషన్ల కోసం నూలు డిపోను వేములవాడలో ఏర్పాటు చేశారన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్లకు ఏ నిధులు ఇవ్వలేదని, నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.కేంద్రం నుంచి రూ. కోట్ల నిధులు తీసుకువస్తే వాటిని వృథా చేస్తున్నారని, కేంద్రం ఇచ్చిన నిధుల లిస్టును కేటీఆర్‌తో సహా అందరికీ పంపుతానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ కంటే తనకే మెజారిటీ ఓట్లు వేశారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు 2.40 లక్షల మెజారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడూ తనకు భయపడ్డ కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డా వేసి, ఓటుకు రూ.5 నుండి 10 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో బలవంతంగా ఏడు గ్రామాలను కలిపి అక్కడి ప్రజలకు ఉపాధి హామీ పని లేకుండా చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విలువైన గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, ఓట్లు వేస్తే సిరిసిల్లను తాను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జే సంఘప్పతోపాటు, 39 వార్డుల అభ్యర్థులు, పార్టీ జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.