కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ పరంపరలో భాగంగా ఐదవ పురాణమైన “శ్రీ మహా వరాహ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞము” కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ జ్ఞానయజ్ఞంలో ప్రసిద్ధ శృంగేరి ఆస్థాన పండితుడు, పురాణ ప్రవర, బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ ప్రవచనాలు అందించనున్నట్లు తెలిపారు. శ్రీ మహా వరాహ స్వామి మహిమ, ధర్మ పరిరక్షణ, భక్తి మార్గం వంటి విశిష్ట అంశాలపై ఆయన ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మికంగా ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 13 నుండి 19 వరకు ప్రతి రోజు సాయంత్రం 6.00 గంటల నుండి 7.30 గంటల వరకు ఈ ప్రవచనాలు నిర్వహించబడుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు యువతలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.