Take a fresh look at your lifestyle.

సంజయ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే

సంజయ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
జగిత్యాల ఎమ్మెల్యేకు స్పీకర్ క్లీన్ చీట్
ఈ నెల 19కు వాయిదాపడ్డ కడియం విచారణ
తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటోన్న ఇరువురు ఎమ్మెల్యేలు
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కల్వకుంట్ల కవిత

ముద్ర, తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు వేటు గండం తప్పింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్‌పై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా దానిపై స్పీకర్ బుధవారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇలా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై స్పీకర్ నిర్ణయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకూ స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మందికి పార్టీ ఫిరాయింపుల కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు క్లీన్ చిట్ పొందారు.

నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే : ఎమ్మెల్యే సంజయ్
పార్టీ ఫిరాయింపు కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పందింకాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. అలాగే తాను బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు కడుతున్నానని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని చెప్పారు. తాను ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేగానే మద్దతు ఇస్తానని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు.

కడియం విచారణ వాయిదా
పార్టీ ఫిరాయింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్నస్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ ఈ నెల 19న వాయిదా పడింది. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నుంచి ఫిరాయింపు నోటీసులుఅందుకున్న కడియం బుధవారం విచచారణ కోసం నేడు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. మరోవైపు కడియంపై పార్టీ ఫిరాయింపు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా విచారణకు హాజరై తన వాదనలు వినిపించారు. ఆ సమయంలో వివేకానంద తనవద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్ కు అందించారు. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇరువురు నుంచి వాంగూల్మాలు తీసుకున్నారు. కాగా మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలు అన్నీ పూర్తయ్యాక ఈనెల 19న మరోసారి విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేశారు. కాగా ఈనెల 18న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని రెండ్రోజుల క్రితం ఆదేశించారు. వీరిద్దరి విచారణ పూర్తయ్యాక అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దానం నాగేందర్ విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్ లో చేరావని ఒప్పుకో..
కడియం శ్రీహరి విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో పనిచేస్తూ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీతులు చెప్పడం ఆపి.. కాంగ్రెస్ లో చేరినట్లు స్పీకర్ ఎదుట అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ విచారణలో కాలయాపన చేస్తూ.. అనర్హత నుంచి ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు : మాజీ ఎమ్మెల్సీ కవిత
పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‍కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‍చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్‍కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‍లో పాల్గొన్నారంటేనే పార్టీ ఫిరాయించినట్టు కదా అని ప్రశ్నించారు. ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి స్పీకర్ గారు? అని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్‍పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టేసిన స్పీకర్ నిర్ణయాన్ని కవిత తప్పుబట్టారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ సంజయ్ కు క్లీన్ చిట్ ఇవ్వడం దారుణమన్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో మీరు క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ లు ఇవ్వడం ఎంత వివాదాస్పదం అయ్యిందో లోకమంతా చూసిందన్నారు. అయినా ఆ విషయం మీ దృష్టికి రాలేదా? అని కవిత స్పీకర్ ను ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేసిన స్పీకర్.. మీరు రాజ్యాంగ బద్దమైన స్పీకర్ చైర్‍లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? అన్నారు. అదే నిజమైతే మీరు భారత రాజ్యాంగాన్ని, చట్ట సభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడగలుగుతారు? అని నిలదీశారు.

Leave A Reply

Your email address will not be published.