Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వచ్చేది గుండుసున్న- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మతం పేరుతో రాజకీయాలు బీజేపీ అలవాటు
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
పవన్ కల్యాణ్ కు తెలంగాణలో ఏం పని..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఈ నెల 11న రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదన్న ఆయన ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మీడియతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమేనన్నారు. తెలంగాణ ప్రజలందరూ జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. మత వైషమ్యాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించవద్దని కోరారు. భైంసా అల్లర్లతోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందనీ ఈ విషయాన్ని గమనించి మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రచారం చేస్తోన్న బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారో ముందు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమది మంది ఎంపీలు కేంద్రంలో ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. వీరిలో ఇద్దరు కేంద్రమంత్రులు కూడా ఉన్నారన్నారు. ఇంత మంది కలిసి ఇటీవల కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ లో తెలంగాణకు ఏ మేరకు నిధులు, అభివృద్ధి పనులు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ‍తోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలుగా గెలిచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు, ఐఐఎమ్ ఏర్పాటుతో పాటు పలు అంశాల్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం ప్రణాళికలు రూపొందిస్తూ దేశ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు వంటి కీలకాంశాలను విస్మరిస్తోందని మండిపడ్డారు. బయో, ఫార్మ, సెమి కండక్టర్ పరిశ్రమల్లో, టూరిజంలో రాష్ట్రాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతం అనీ ఈ లెక్కన కేంద్రం నుండి రూ.3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉందని మహేశ్ కుమార్ చెప్పారు. అయినా గత ఐదేళ్లలో రూ.1.84 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఐదేండ్లలో రూ.4.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి తిరిగి రూ.3.76 లక్షల కోట్లే ఇచ్చిందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్‍లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులు గుజరాత్ కు తరలిస్తున్నారని విమర్శించారు. మహిళలకు బడ్జెట్‍లో రూ.90 వేల కోట్ల నిధులు కోత పెట్టారన్న ఆయన బీసీలకు ఇచ్చింది రూ.13,600కోట్లు మాత్రమేనన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారంపై టీపీసీసీ స్పందించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని సూచించారు. ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరూ ఓటు వేయరన్నారు.

Leave A Reply

Your email address will not be published.