Take a fresh look at your lifestyle.

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి సజీవ దహనం

ప్రమాదం.. విషాదం
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
ఫర్నీచర్‌ షాపు ఓనర్‌‌ సతీష్ బచా అరెస్ట్
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
22 గంటలు సాగిన రెస్క్యూ
దట్టమైన పొగలతో సహాయకచర్యల్లో జాప్యం
అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్
అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

ముద్ర, హైదరాబాద్ :

నాంపల్లిలో స్టేషన్ రోడ్డులో ఈ నెల 24న జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఓ ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు నాలుగు అంతస్తులకు వ్యాపించిన ఈ ప్రమాదంలో చాలా మంది చిన్న చిన్న గాయాలై ప్రాణాలతో బయటపడగా.. ఆ మంటల్లో చిక్కుకున్న ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలో దిగిన రెస్క్యూ బృందాలు. 22 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన తర్వాత మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గుర్తించిన అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం వాటిని ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మరో ప్రతి మృత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రమాదంపై చేపట్టిన ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. దీంతో ఫర్నీచర్‌ షాపు యజమాని సతీష్ బచాను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఫైర్‌ సేఫ్టీ రూల్స్ పాటించకుండా సెల్లార్‌లో వ్యాపారం చేస్తుండటంతో కేసు నమోదు చేశారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

22 గంటల రెస్క్యూ..
హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగాపై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు. ప్రమాద సమయంలో భవనంలో పలువురు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానిక యువకులు సాహసించి భవనంలోకి వెళ్లి కొంత మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భవనంలోని మిగిలిన కుటుంబాలను, పక్కనే ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది అన్ని విధాల ప్రయత్నించారు. ఆక్సిజన్ సిలిండర్‌తో సెల్లార్ లోకి వెళ్లారు. వీరివెంట వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.

ప్రముఖుల సంతాపం
అగ్ని ప్రమాదంపై పలువురు రాజకీయ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ విషాదం నుంచి వారు త్వరగా తేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యాపారాలు నిర్వహించడం అత్యంత నేరమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు, సంస్థలు ఎక్కడైనా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని నగరవాసులను కోరారు. నిర్లక్ష్యంతో ఒక్క ప్రాణం కూడా పోకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫర్నీచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ,పోలీస్ ,రెవెన్యూ , హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు ఉంటే పిర్యాదు చేయాలని కోరారు.

మృతుల వివరాలు:

బీ.బీ. అమ్మ
భర్త: లేట్ హుస్సేన్ ఖాన్
వయస్సు: 60 సంవత్సరాలు
నివాసం: కర్ణాటక
(వాచ్‌మన్ సమీర్ తల్లి)
====
అఖిల్
తండ్రి: యాదయ్య
వయస్సు: 7 సంవత్సరాలు
నివాసం: నాంపల్లి
==========
ప్రణీత్
తండ్రి: యాదయ్య
వయస్సు: 11 సంవత్సరాలు
నివాసం: నాంపల్లి
=====
మొహమ్మద్ ఇంతియాజ్
తండ్రి: మొహమ్మద్ యూసుఫ్
వయస్సు: 31 సంవత్సరాలు
నివాసం: నాంపల్లి
======
సయ్యద్ హబీబ్
తండ్రి: ముజీబుద్దీన్
వయస్సు: 30 సంవత్సరాలు
వృత్తి: ఆటో డ్రైవర్
నివాసం: శాస్త్రిపురం, రాజేంద్రనగర్
=========

Leave A Reply

Your email address will not be published.