Take a fresh look at your lifestyle.

రైతు చెంతకే ‘భూధార్‌’..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సర్వే వ్యవస్థలో విప్లవం
క్షేత్రస్థాయిలోకి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు
పాత పద్ధతులకు స్వస్తి.. ఆధునిక ‘రోవర్స్’తో కొలతలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ముద్ర, ​ఖమ్మం: రాష్ట్రంలో అన్ని రకాల భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ‘ధరణి’ ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ.. రైతులకు చుట్టంలా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని అమలులోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌ (ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా ‘రోవర్స్’ సాంకేతికతను వాడుతున్నామని చెప్పారు. ఇప్పటికే ఆరొందల రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించినట్లు వివరించారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి నియామక పత్రాలు అందజేశామని, వీరంతా పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.​ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.