ముద్ర : మల్కాజిగిరి
మల్కాజిగిరి రహదారి భద్రతను పెంపొందించేందుకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భారీగా కేసులను వెలికి తీశాయి. గత వారాంతంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 159 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.
పోలీసుల వివరాల ప్రకారం, పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. మొత్తం కేసుల్లో 137 ద్విచక్ర వాహనాలు, 5 ఆటో రిక్షాలు, 17 కార్లు,నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ముఖ్యంగా 14 మంది మద్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో వాహనాలు నడిపినట్లు గుర్తించారు.
పట్టుబడిన నిందితులందరినీ న్యాయస్థానంలో హాజరుపరచనుండగా, ఇప్పటికే గత వారం (మార్చి 29 నుండి ఏప్రిల్ 4 వరకు) విచారణకు వచ్చిన కేసుల్లో కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. 13 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, ఇద్దరికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. మరొక 94 మందికి జరిమానాలు విధించబడ్డాయి.
ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి కఠిన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, అలాంటి ఘటనల్లో మరణాలు సంభవిస్తే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేసి, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, మద్యం సేవించి వాహనాలు నడపకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.