శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం (మంత్రాలయం) మాన్య భూముల ఆక్రమణ – తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ యువత డిమాండ్
ముద్ర,గద్వాల:
మంత్రాలయంలో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన అత్యంత విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని మఠం భూములను కొందరు అక్రమార్కులు రాజకీయ అండదండలతో ఆక్రమించుకుని, సాగు చేయడమే కాకుండా శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నారని ఉలిగేపల్లి గ్రామ యువత ఆరోపించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా మల్దకల్ మండలం ఉలిగేల్లి గ్రామస్తులు సర్వే నంబర్ 15,16,24. 25 ,26.,27,28 ,145,146,148,178,197,198,201,202,258,259 లో గల శ్రీరాఘవేంద్ర స్వామి మఠం భూములు కబ్జాకు గురయ్యాయని, ఆలయ భూములను రక్షించాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ…
మంత్రాలయంలోగల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వారికి దశాబ్దాల క్రితం భక్తులు స్వామివారి కైంకర్యాల కోసం, అన్నదాన కార్యక్రమాల కోసం గద్వాల జిల్లాలో అనేక ఎకరాల భూములు ఉన్నాయని, అటువంటి పవిత్రమైన భూములను రికార్డులు తారుమారు చేసి అక్రమంగా అనుభవిస్తుండటం ధర్మ విరుద్ధమని గ్రామస్తులు పేర్కొన్నారు. మల్దకల్ మండలం ఉలిగేల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 15,16,24,25, 26, 27, 28 ,145,146,148,178,197,198,201,202,258,259 లో గల మఠం భూములు కబ్జాకు గురయ్యాయని, సర్వే చేసి కాపాడాలని కోరారు. గతంలో శ్రీరాఘవేంద్ర స్వామి మఠం వారి ఆలయ భూములో గ్రామ పెద్దలు క్రీడా ప్రాంగణం, ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అట్టి ఖాళీ ప్రదేశాలను కూడా అక్రమార్కులు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆలయ భూముల్లో హిందు స్మశాన వాటికకు కేటాయించగా అట్టి భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి శ్రీరాఘవేంద్ర స్వామి మఠం భూములను కబ్జాకోరుల నుంచి పరిరక్షించాలని కోరినట్లు గ్రామస్తులు తెలిపారు.