కబ్జా పుకార్లు నమ్మొద్దు…అవి తాతల నుండి వచ్చిన ఆస్తులు కబ్జా పుకార్లు నమ్మొద్దు…అవి తాతల నుండి వచ్చిన ఆస్తులు
ఆస్తి తగాదా విషయంలో మంత్రి పేరు రావడం దురదృష్టకరం…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట అర్బన్ మండలం రంగాధాంపల్లి సమీపంలోని మైత్రివనం సమీపంలో గల భూ తగాధ విషయం లో రాజకీయ ప్రమేయం ఉందంటూ ఒక మంత్రి పేరు రావడం దురదృష్టకరమని భూ తగాధలో ఉన్న బాధితులు ఆంజనేయులు అయన కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రంగాధాంపల్లి, మైత్రివనం సమీపంలో గల సర్వేనెంబర్ 974,975,978,988,1005,1006 సర్వే నెంబర్లకు సంబంధించి గత కొంతకాలంగా వస్తున్న రాజకీయ ఆరోపణలు కేవలం తప్పుదారి పట్టించడానికి మాత్రమేనని ఇందులో ఎవరి ప్రమేయం లేదని తమ ఆస్తిని తామే ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామని తెలిపారు. రాగం మల్లయ్యకు ఐదుగురు కుమారులు ఉంటే ఒకరు సిద్దిపేట పరిధిలో నివాసం ఉంటున్నారని నలుగురు వరంగల్ పరిధిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. 1992 వ సంవత్సరంలో భూ అసలు యజమాని రాగం మల్లయ్య చనిపోయే నాటికి సుమారు 28 ఎకరాల భూమి ఉంది అని అది తమ కుమారులైన ఐదుగురికి సరి సమానంగా పంచి ఆ కాలంలోనే అందరికీ పట్టా పాస్ బుక్కులు ఇచ్చారని తెలిపారు. సిద్దిపేట పరిధిలో నివాసం ఉంటున్న రెండవ కుమారుడు రాగం ఎల్లయ్య తమకు వచ్చిన ఐదు ఎకరాలతో పాటు మిగిలిన నలుగురి కుమారుల ఆస్తిని కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకున్నాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా అనేకసార్లు మిగిలిన నలుగురి కుమారులకు ఇక్కడ స్థలం లేదని గొడవలకు దిగినప్పుడు నలుగురి వద్ద ఉన్న పాస్ బుక్ డాక్యుమెంట్స్ ను సుమారు 1998 నుండి ఇప్పటివరకు అనేకసార్లు అధికారులకు సమర్పించి క్లియరెన్స్ ఆర్డర్స్ తీసుకున్నట్లు వారు తెలిపారు. అయినప్పటికీ దౌర్జన్యం చేస్తూ గొడవలకు దిగుతూ సర్వేకు వచ్చిన అధికారులపై దాడులు చేస్తూ రాగం ఎల్లయ్య కుటుంబ సభ్యులు వారి కుమారులు నానా హంగామా సృష్టిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిలో ముగ్గురు కుమారులు 2007వ సంవత్సరంలో తమ అవసర నిమిత్తం తమ పాలుకు వచ్చిన భూమిలోనుండి ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున ఆరు ఎకరాలు అమ్ముకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న నలుగురు కుమారుల ఆస్తిని సుమారు 15 ఎకరాలు తమకు నమ్మకం ఉన్న బాలాజీ రియల్ ఎస్టేట్ పేరిట ఉన్న సంస్థకు అమ్ముకున్నామని తెలిపారు. ఏ అధికారి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నాడని తమకు సంబంధం లేదని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అన్న నమ్మకంతోనే ఆస్తిని విక్రయించామని పదేపదే రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించడం దురదృష్టకరమని ఇది సమంజసం కాదని తెలిపారు. తమ ఆస్తిని ఎవరు కబ్జా చేయలేదని తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని వారసత్వంలో భాగంగానే ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్ ఆర్డినెన్స్ కాపీల ఆధారంగానే తమ ఆస్తిని విక్రయించుకున్నామని తెలిపారు. సిద్దిపేటలో నివాసముంటున్న రెండవ కుమారుడు రాగం ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రస్తుతం సిద్దిపేట పరిధిలో ఉన్న 15 ఎకరాలతో ఎటువంటి సంబంధం లేదని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తాము కబ్జాలో లేమని అనే మాట అవాస్తమని కబ్జాలోనే ఉన్నామని సర్వేయర్ తో బౌండరీ కూడా చేయించుకున్నామని అన్ని పూర్తయిన తర్వాతనే స్థలాన్ని విక్రయించామని తెలిపారు. వరంగల్ మరియు సిద్దిపేట పరిధిలో రాగం మల్లయ్య అయిదుగురి కుమారులకు సమాన ఆస్తులు ఉన్నాయని అందులో భాగంగానే మిగిలిన నలుగురు కుమారులు సిద్దిపేటలో తమకు వచ్చిన స్థలాన్ని విక్రయించుకున్నామని ఎవరి ఆస్తిని అక్రమంగా తీసుకోలేదని తెలిపారు. సమావేశంలో బాధితులు రాగం వెంకటేష్ యాదవ్ ,రాగం ఆంజనేయులు యాదవ్,లెదండి సులోచన యాదవ్,ముద్దం లలిత యాదవ్,మదిగాని అనురాధ యాదవ్,పెద్దపులి రేవతి యాదవ్,తెల్జీరు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.