ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట 39వ వార్డు పరిధిలోని “స్వేచ్ఛ బడి”లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రత కారణంగా వచ్చే ఎండదెబ్బ, వడదెబ్బ నివారణకు ప్రివెంటివ్ ఆయుష్ మందులను ప్రజలకు పంపిణీ చేశారు.
అలాగే బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, వెరికోస్ వెయిన్స్, అజీర్ణం, పక్షవాతం, పైల్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆయుష్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, సూచనలు అందించారు. శిబిరంలో 65 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించారు.
ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఐపి సేవలను కూడా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలందరూ ఆయుష్ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయుష్ హాస్పిటల్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డా. ఉమాదేవి, 39వ వార్డు మాజీ కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఆయుష్ వైద్యులు డా. గౌతమీ ప్రియ, డా. నసీమున్నీసా, డా. బాలకుమారి, ఫార్మసిస్టులు జ్యోతి, సంతోషి రాణి, ఎస్‌ఎన్‌వోలు వెంకటేష్, రమేష్ స్వామి పాల్గొన్నారు. జిల్లా డీపీఎం డా. భాను తేజ కూడా హాజరయ్యారు.