Take a fresh look at your lifestyle.

కుంటలో మునిగి ఇద్దరు మృతి

చేపలకు వెళ్లి బాలుడు, రక్షించబోయిన మరొకరు…
పిల్లికొట్టాల్, వడియారంలో విషాదం

ముద్ర ప్రతినిధి, మెదక్:
చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు గల్లంతు కాగా కాపాడబోయిన మరో వ్యక్తి మరణించిన సంఘటన మెదక్ పట్టణ శివారులో గల కుమ్మరి కుంట వద్ద గురువారం చోటు చేసుకుంది.

ఇంచార్జి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…మెదక్ జిల్లా చేగుంట (మం) వడియారంకు చెందిన శ్రీకాంత్, శాంతమ్మకు ఇద్దరు కుమారున్నారు. పెద్ద కుమారుడు నవదీప్ 7వ తరగతి పూర్తవగా వేసవి సెలవులలో మెదక్ పట్టణం పిల్లికోట్టాల డబుల్ బెడ్ రూంలో గల అమ్మమ్మ ఇంటికి వారం క్రితం వచ్చాడు. నవదీప్ మేన మామ కుమారుడు వరుసకు బావ మరిది ప్రణయ్ తో కలిసి చేపలు పట్టడానికి కుమ్మరి కుంటకు వెళ్లారు.

నవదీప్ (13) కుంటలో గల్లంతు కావడంతో అరిచారు. అదే సమయంలో పిల్లికొట్టాల్ కు చెందిన తూర్పు యాదగిరి (35), కిషోర్, కరుణాకర్ లు అటు వైపు బహిర్భూమికి వచ్చారు.

అరుపులు విని గల్లంతైన బాలుడిని బయటకు తీసేందుకు నీటిలోకి దిగారు. జేసీబీ గుంతలు ఉండడంతో యాదగిరి మునిగిపోయాడు. కిషోర్ సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాడిని రప్పించగా గంటకు పైగా వెతికి యాదగిరి, తర్వాత నవదీప్ మృతదేహం బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యాదగిరి మెదక్ కల్లు డిపోలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య రేణుక, ముగ్గురు పెళ్లికాని కూతుళ్లున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. యాదగిరి తమ్ముడి కుమార్తె వేడుక బుధవారం జరగ్గా… బంధువులతో సరదాగా గడిపేందుకు పనికి వెళ్లకపోవడంతో యాదగిరికి మృత్యువు కబళించింది. ఇదే కుంటలో నాలుగేళ్ల క్రితం పిల్లికోటాల్ కు చెందిన వ్యక్తి మునిగి మరణింంచాడు.
చైర్ పర్సన, వైస్ చైర్మన్ పరామర్శ


కుమ్మరి కుంటలో ఇద్దరు గల్లతైన విషయం తెలుసుకుని మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ సంఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇద్దరి మరణం బాధాకరమన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వెంట నాయకులు తాహెర్, దాయర సిద్దిరాములు తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.