Take a fresh look at your lifestyle.

సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి:
సూరేపల్లిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే కృష్ణా డెల్టాకు నీటి సమస్య తలెత్తదని తెలిపారు. గతంలో ప్రాజెక్టు 72 శాతం పూర్తయినప్పటికీ, పూర్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగిందని విమర్శించారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ మునిగిపోయిందని, ఇప్పుడు కేంద్ర సహకారంతో రూ.1000 కోట్ల వ్యయంతో మళ్లీ నిర్మించి పూర్తి చేశామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా పునఃప్రారంభించే అవకాశం తనకు లభించిందని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రూ.4,660 కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా విద్యుత్ ఛార్జీలను తగ్గించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. గత పాలకులు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు.

సోలార్ రూఫ్‌టాప్ ద్వారా “ప్రోజ్యూమర్” విధానాన్ని అమలు చేస్తామని, దీని ద్వారా ప్రజలు విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారని తెలిపారు. సామాన్య ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రతపై రాజీ ఉండదని, మహిళలపై దాడులు జరిగితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

హాస్టళ్లు, బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు, మధ్యాహ్న భోజనం వంటి అంశాల్లో మరింత మెరుగుదల అవసరమని అధికారులకు ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాలని సూచించారు.

ఉచిత ఇసుక అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, రూ.వెయ్యి కోట్ల ఆదాయం కోల్పోయినా ప్రజల కోసం ఉచితంగా ఇసుక అందిస్తున్నామని తెలిపారు. పౌరసేవలను మెరుగ్గా అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.

కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ వివిధ వేషాలు వేస్తున్నాయని విమర్శించిన ముఖ్యమంత్రి, ప్రజలు నిజాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.