- ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జగిత్యాలలో శాంతి ర్యాలీ.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం ఆదివాసులపై చేస్తున్న హత్యకాండను అపాలని ఐక్య వేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వామపక్ష, ప్రజాతంత్ర, అంబేద్కర్ వాదుల, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ కగర్ వెంటనే ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించాలని పేర్కొన్నారు.ఆదివాసులపై ఇప్పటివరకు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితొ విచారణ జరిపించాలని, అలాగే రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ని అమలుచేసి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అమరుల భౌతిక కాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలు మేలుకోకపోతే అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను లేకుండా చేయాలని ప్రయత్నిస్తుందని ఈ విషయాల్లో ప్రజలు ప్రశ్నించే గొంతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, పౌర హక్కుల సంఘం నాయకులు పొన్నం రాజమల్లు, భారత్ బచావో నాయకులు పిట్టల నారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చింత భూమయ్య, గల్ఫ్ బాధిత సంఘం నాయకులు జిల్లా రవిగౌడ్, డి ఎల్ పి ఓ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, ఏఐకేఎంఎస్ నాయకులు గాజంగి రాజేష్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.