డి.సోమసుందర్ పిలుపు!
ముద్ర, పాలకొల్లు :
విజయవాడలో త్వరలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ పిలుపు ఇచ్చారు. ఎపియుడబ్ల్యుజే పశ్చిమగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శనివారం పాలకొల్లు ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు జి.ఉదయ భాస్కర్ అధ్యక్షత వహించారు. డి.సోమసుందర్ మాట్లాడుతూ దేశంలో మీడియా స్థితిగతులను మెరుగు పరచడానికి , వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి భద్రత, వేతనాలు, రక్షణ, ఆరోగ్యం, వంటి హక్కుల సాధనకు ఐజేయూ పోరాడుతుందని తెలిపారు. దేశంలో 27 రాష్ట్రాలలో ఐ.జే.యు. కు అనుబంధంగా రాష్ట్ర సంఘాలు ఉన్నాయని, దాదాపు ముప్పై వేల మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని సోమసుందర్ వివరించారు.
ఐజేయు జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలు మార్చి 27,28,29 తేదీల్లో విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగుతున్నాయని, 28 వ తేదీ సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశాలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. దేశం నలుమూలలనుండి హాజరయ్యే దాదాపు మూడు వందలమంది వర్కింగు జర్నలిస్టులు మీడియా సంబంధిత అంశాలపై చర్చిస్తారని, వారు సమావేశంలో పది తీర్మానాలను ఆమోదించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారని సోమసుందర్ తెలిపారు.
ఆతిథ్యానికి మారుపేరైన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా యూనియన్ కార్యదర్శి గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ ఐజేయూ 2 వ ప్లీనరీ 1992 లో విజయవాడలో జరిగిందనీ, తిరిగి ముప్పై నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఐజేయు ప్లీనరీ సమావేశాలు విజయవాడలో జరగడం ఎపియుడబ్ల్యుజే కు గర్వకారణమని అన్నారు. .