Take a fresh look at your lifestyle.

యూఎన్ ఐ కార్యాలయం సీజ్‌పై ఐజేయూ ఆగ్రహం

న్యూఢిల్లీ/చండీగఢ్ : యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ ఐ) కార్యాలయాన్ని బలవంతంగా సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 20 సాయంత్రం న్యూఢిల్లీలోని రఫీ మార్గ్‌లో ఉన్న యూఎన్ ఐ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశాల పేరుతో స్వాధీనం చేసుకున్న తీరు దిగ్భ్రాంతిని కలిగించిందని  ఐజేయూ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు, ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ అధికారులు వ్యవహరించిన తీరు దేశంలోని జర్నలిస్టులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఇది దేశంలో పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని, ప్రజాస్వామ్యంలో నాలుగవ మూల స్తంభంగా భావించే మీడియాకు అవమానకరమని వారు పేర్కొన్నారు.
సిబ్బందికి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వారి వ్యక్తిగత వస్తువులు తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ చర్యను అమలు చేయడం బాధాకరమని ఐజేయూ నాయకులు తెలిపారు. సాధారణ పరిపాలనా ప్రక్రియలా కాకుండా, ఇది పోలీసు దాడి మాదిరిగా సాగిందని విమర్శించారు.

ఈ చర్య సందర్భంగా మహిళా జర్నలిస్టులను తోసివేసినట్లు వచ్చిన సమాచారం, దృశ్యాలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయని వారు పేర్కొన్నారు. పోలీసుల ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు జరిపి, జర్నలిస్టుల గౌరవం, భద్రతకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంతో ఘన చరిత్ర కలిగిన విశ్వసనీయ వార్తా సంస్థలలో యూఎన్ ఐ ఒకటని, దశాబ్దాలుగా ఢిల్లీలోని ఈ కార్యాలయం సజీవ వార్తా కేంద్రంగా పనిచేస్తోందని ఐజేయూ గుర్తుచేసింది. అర్ధరాత్రి సమయంలో కార్యాలయాన్ని మూసివేసి, వార్తా సేకరణ, ప్రసారాన్ని అడ్డుకోవడం మొత్తం జర్నలిస్టు లోకాన్ని భయపెట్టడమేనని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.