- కృష్ణా ట్రిబ్యూనల్…2 విచారణకు నేనే హాజరవుతా.
- రాష్ట్రం తరుపున వాదనలు వినిపిస్తా.
- న్యాయవాదుల బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తాం.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాశయాలలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కృష్ణా ట్రిబ్యునల్ -2 ముందు తానే స్వయంగా హాజరై తెలంగాణా తరపున వాదనలు వినిపించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా,గోదావరి జలాశయాలలో రాష్ట్ర కేటాయింపులకై న్యాయస్థానాలలో రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల బృందానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ఆదివారం ఎర్రమంజిల్ లోని జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో పాటు న్యాయవాదుల ప్రతినిధుల బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా ట్రిబ్యూనల్.2 ఎదుట జరిగిన వాదనలను పూర్తిగా సమీక్షించడంతో పాటు ఈ నెల 15,16 తేదీలలో ట్రిబ్యునల్ ముందు లెవనెత్తాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకున్నారు. 2014 ఆంద్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కృష్ణా జలాశయాలలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి,న్యాయబద్ధంగా తెలంగాణా రావాల్సిన నీటి కేటాయింపులు వంటి అంశాలను మంత్రికి అధికారులు పూర్తి స్థాయిలో వివరించారు.దీనిపై ఆయన స్పందిస్తూ న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై బలమైన వాదనలు వినిపించేందుకు మార్గదర్శనం చేశారు.
దశాబ్దాలుగా సాగునీటి మీద ఆధారపడి సేద్యం చేస్తున్న రైతాంగం నీటి కొరతతో ఆత్మక్షోభకు గురయ్యారన్నారు. అటువంటి అన్యాయలను సరిదిద్డేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.అదే సమయంలో కృష్ణా ట్రిబ్యునల్.2 ముందు వాదనలకు అవసరమైన సమగ్రమైన సమాచారాన్ని అందించడంతో పాటు ఢిల్లీలో ఉన్న బృందంతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అంతే గాకుండా రాష్ట్రానికి సంబంధించిన వరకు వివిధ న్యాయ స్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసులు,అప్పీల్స్ వాటి ప్రస్తుత స్థితి ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని ఆయన అధికారులకు సూచించారు.అంతర్ రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమవేశంలో రాష్ట్ర నీటిపారుదల సలహాదారు ఆదిత్యా దాస్ నాధ్,ఇఎన్ సి లు అనిల్ కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్య నాథన్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post