- నేడు, రేపు సామాజిక న్యాయం సాధికారతపై సదస్సుకు హాజరు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో సామాజిక న్యాయం సాధికారతపై జరగనున్న చింతన్ శిబిర్ కార్యక్రమంలో రాష్ట్రం తరపున పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆదివారం బయలుదేరి వెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన నేడు, రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేసిన వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు. ఈ శిబిర్ లో ప్రజా పాలన ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, వారి సంక్షేమం, అభివృద్ధి, దేశానికి దిక్సూచిగా కుల గణన, బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలు తదితర అంశాలపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు. ఈ చింతన్ శిబిర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా ఉన్న చట్టాలు, అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేసే అంశంపై చర్చలు జరుపనున్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్లు, మద్యం వ్యసనం, మాదకద్రవ్యాల దుర్వినియోగ బాధితులు, లింగమార్పిడి వ్యక్తులు, యాచకులు, మాన్యువల్ స్కావెంజర్స్, సంచార తెగలు, ఆర్థికంగా వెనుకబడిన వారు వైకల్యాలున్న వ్యక్తులు సమాజంలోని వివిధ విభాగాల ద్వారా సంక్షేమం కోసం వివిధ చట్టాలు పథకాల అమలుపై చింతన్ శిబిర్ లో చర్చించనున్నారు. మంత్రులతో పాటు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వెళ్లారు.