ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కీలక అడుగుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ పట్టణంలోని ఈవీఎం గోదాముకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా అత్యంత అవసరమని తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఈ కేంద్రం ద్వారా ఉచితంగా విభిన్న రంగాల్లో శిక్షణ అందించడం గొప్ప అవకాశం అని అన్నారు.
ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, జిల్లాలో యువతలో వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా కృషి చేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో సుమారు 70 రకాల కోర్సులు అందించబడతాయని, ప్రతి కోర్సులో 30 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, సంవత్సరానికి దాదాపు 167 బ్యాచ్‌లకు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
శిక్షణ పొందే అభ్యర్థులు కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా ప్రాక్టికల్ పరిజ్ఞానం సంపాదించుకోవాలని, ఆ నైపుణ్యాలు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంచుతాయని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీ, త్వరలో నిర్వహించనున్న స్కిల్ సర్వే ద్వారా నిరుద్యోగులకు తగిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రం నిర్వహించబడనుండగా, స్థానిక యువత తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, యూనియన్ బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.